క్యాన్సర్ నివారణ, నియంత్రణ, చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలతోపాటు కొత్తగా నిర్మించనున్న మెడికల్ కాలేజీల్లో కూడా ప్రత్యేక క్యాన్సర్ విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, కేన్సర్ కేర్ అండ్ ట్రీట్‌మెంట్‌కు ఇది సెంటర్ కావాలని సిఎం సూచించారు. ఇదివరకు ఉన్న కేన్సర్ విభాగాలను బలోపేతం చేయడం, లేనివాటిలో సదుపాయాల కల్పన జరగాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలు
⦿ విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 4 లైనాక్ మెషీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.
⦿ శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లో బంకర్ల నిర్మాణానికి సీఎం గ్రీన్ సిగ్నల్.
⦿ మరో 7 పాత మెడికల్ కాలేజీల్లో కేన్సర్ శస్త్రచికిత్సలు కోసం ఆపరేషన్ ధియేటర్ల అప్‌గ్రడేషన్, పాథాలజీ డిపార్ట్‌మెంట్లలో ఆధునిక సౌకర్యాలు, కీమో థెరపీ, డ్రగ్స్ తదితర సదుపాయాలు ఏర్పాటుకు సీఎం ఆమోదం.
⦿ వైయస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోకి 12 రకాల రాపిడ్ డయాగ్నోస్టిక్స్ కిట్లు. అందుబాటులో 67 రకాల మందులు.
సిఎం సూచనలు
⦿ ప్రతి టీచింగ్ ఆస్పత్రి కూడా ఆ జిల్లాకు సంబంధించిన వైద్యకార్యకలాపాలకు సెంటర్‌గా వ్యవహరించాలి
⦿ విలేజ్ క్లినిక్స్ దగ్గరనుంచి ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఆస్పత్రి కూడా బోధనాసుపత్రి పరిధిలోకి రావాలి
⦿ దీనివల్ల క్యాన్సర్‌లాంటి వ్యాధులను గుర్తించడం, వైద్యం అందించడం సులభతరమవుతుంది
⦿ విలేజ్ క్లినిక్స్ విధివిధానాల్లో పారిశుద్ధ్యం మరియు తాగునీటి నాణ్యతపై నిరంతర పరిశీలన, నివేదికలు పంపాలి
⦿ ప్రతినెలాకూడా తప్పనిసరిగా నివేదికలు పంపాలి
⦿ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పర్యవేక్షణకు జిల్లాల్లో ప్రత్యేక అధికారిని నియమించాలి
⦿ రాష్ట్రంలో రక్తహీనత కేసులు రాకుండా చూడాలి
⦿ అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం అందుతున్న తీరుపై నిరంతర పర్యవేక్షణ చేయాలి
⦿ రక్తహీనత అధికంగా ఉన్న ప్రాంతాల్లో అదనంగా పౌష్టికాహారాన్ని అందించడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి
⦿ వైద్యాధికారుల సిఫార్సు మేరకు వైద్యపరంగా, ఆహార పరంగా వారిపై దృష్టిపెట్టాలి
⦿ వ్యవసాయానికి ఆర్బీకేలు ఎలా వ్యవహరిస్తున్నాయో ప్రజారోగ్యం విషయంలో కూడా విలేజ్‌క్లీనిక్‌లు కీలక పాత్ర పోషించాలి
⦿ స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ జరగాలి
⦿ పిల్లల ఆరోగ్య పరిస్థితులను కనుక్కోవడంతోపాటు నిరంతరం కంటి పరీక్షలు చేయాలి
⦿ ఆరోగ్యశ్రీ చికిత్స అనంతరం పేషెంట్‌కి అవసరమైన అదనపు మెడికేషన్ అందించేలా చూడాలి
⦿ ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్ ఆస్పత్రుల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాలి
⦿ ఈ వివరాలను విలేజ్ హెల్త్‌క్లినిక్, సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి
⦿ విలేజ్ హెల్త్‌క్లినిక్‌లో దీనికి సంబంధించి హోర్డింగ్ పెట్టాలి
⦿ 104 కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన వెంటనే ఎంప్యానెల్ ఆస్పత్రి సమీపంలో ఎక్కడుందో వివరాలు తెలిసే విధానం ఉండాలి
ఈ సమీక్షా సమావేశంలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి( కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జి ఎస్ నవీన్ కుమార్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్ హరీంద్రప్రసాద్, ఏపీవీవీపీ కమిషనర్ వి వినోద్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : పేరెంట్స్ భాగస్వామ్యంతో స్కూళ్ళ అభివృద్ధి: సిఎం