పోలవరం ప్రాజెక్టుపై చర్చించేందుకు గాను చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విజ్ఞప్తి చేశారు. డయా ఫ్రమ్ వాల్ దెబ్బతిని పోలవరం ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తాము చెబితే దీనికి వైఎస్సార్సీపీ కారణమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆరోపించారని, దీనిపై నిజాలు నిగ్గు తేలాలంటే అసెంబ్లీ సరైన వేదిక అని రాంబాబు చెప్పారు. డయా ఫ్రమ్ వాల్ అంశంపై చర్చించడానికి తాము సిద్ధమని బాబు గతంలో ప్రకటించారని, ఈ అంశంపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని రాంబాబు ప్రతిపాదించారు. అసెంబ్లీకి హాజరు కాబోనంటూ చంద్రబాబు మంగమ్మ శపథం చేశారని, కానీ ద్రౌపది ముర్ము కు ఓటు వేయడానికి వచ్చారని, ఎలాగూ అయన శపథం తప్పారు కాబట్టి ఇప్పుడు అసెంబ్లీకి కూడా హాజరు కావాలని కోరారు.
గతంలో న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేశారని, ఇప్పుడు అరసవిల్లికి యాత్ర చేపట్టారని.. ఇది ప్రజలు చేస్తున్న పాదయాత్ర కాదని అంబటి ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో అతి పెద్ద స్కామ్ చేశారని ఆరోపించారు. అమరావతిపై నాడు ఐ వైఆర్ కృష్ణారావు రాసిన ‘ ఎవరి రాజధాని అమరావతి’ అంటూ ఓ పుస్తకం రాస్తే ఆ సభకు జనసేన, బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నేతలు కూడా హాజరయ్యారని, కానీ ఇప్పుడు అమరావతికి మద్దతు అంటూ బయల్దేరారని విమర్శించారు. అన్ని ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చేయాలని అనుకోవడం తప్పా అని ప్రశ్నించారు.
ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు అమరావతి మోతుబర్లు చేస్తున్న యాత్ర ఈ పాదయాత్ర అంటూ రాంబాబు దుయ్యబట్టారు. పైగా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని బయల్దేరారని, ప్రజలను మోసం చేస్తూ దేవుడి ఫోటో పెట్టుకోవడం దారుణమని, ఇలాంటి వారిని ఆ దేవుడే శిక్షిస్తాడని రాంబాబు పేర్కొన్నారు.
అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వరంటూ నాడు పేదలను నమ్మించి, వారి వద్ద భూములు చౌకగా కొట్టి మళ్ళీ వాటిని ప్రభుత్వానికి అప్పగించి మోసం చేశారని దీనిపై తాము విచారణ జరిపిస్తున్నామని చెప్పారు.
Also Read : కోనసీమలో కొబ్బరికాయలన్నీ అంబటి ఎద్దేవా