సిఎం జగన్ ఎక్కడైనా పర్యటనకు వెళుతుంటే ఆ ప్రాంతాల్లో తీవ్ర నిర్బంధం, ఆంక్షలు పెడుతున్నారని, గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా బారికేడ్లు పెట్టుకొని పర్యటనలకు వెళ్లలేదని టిడిపి సీనియర్ నేత దూలిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. స్కూళ్ళకు సెలవు ఇవ్వడం, ఆయా స్కూళ్ళ బస్సులతో పాటు, ఆర్టీసీ బస్సులు తీసుకొని జనాలను తరలించడం, దుకాణాలు మూసివేయించడం లాంటివి చేస్తున్నారని విమర్శించారు. నేటి కుప్పం టూర్ లో అయితే చివరకు మెడికల్ షాపులు కూడా మూసివేయించారని విస్మయం వ్యక్తం చేశారు. టిడిపి నేతలు, కార్యకర్తలను బైండోవర్ చేస్తున్నారని, ఓ కర్ఫ్యూ వాతావరణం తలపిస్తున్నారని ఆరోపించారు.
సిఎం ఇటీవల విశాఖ వెళ్ళినప్పుడు అక్కడి డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఏకంగా జిల్లా విద్యాశాఖ అధికారికి లేఖ రాశారని, ఫలానా స్కూళ్ళ బస్సులు సిఎం టూర్ కు కావాలి కాబట్టి వాటికి సెలవు ఇవ్వాలంటూ ఆ లేఖలో పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. చివరకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే.. ఆ బాధితులను పరామర్శించేందుకు కూడా బారికేడ్లు కట్టుకొని వెళ్ళాల్సిన దుస్థితిలో సిఎం ఉన్నారని దుయ్యబట్టారు. దేశంలో పరదాలు కట్టుకొని పర్యటించే సిఎం… జగన్ ఒక్కరేనని నరేంద్ర ఎద్దేవా చేశారు. చివరకు సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఇలాగే పర్యటించాల్సిన ఆగత్యం ఏమిటన్నారు.
పోలీసులు, అధికారం ద్వారా ఎన్ని ఆంక్షలు పెట్టినా ప్రజా తిరుగుబాటు రాష్ట్రంలో వస్తుందని, వైఎస్సార్సీపీని బంగాళాఖాతంలో కలుపుతారని నరేంద్ర హెచ్చరించారు.
Also Read : దోమను కూడా పట్టలేకపోయారు: కేశవ్