Danger Dialogues : టీ వీ లు, సామాజిక మాధ్యమాల చర్చల్లో విద్వేష ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడానికి ఏదయినా చట్టం తెస్తారా? అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. చర్చల్లో విద్వేషానికి తావు లేకుండా ఆ చర్చా గోష్ఠిని నిర్వహిస్తున్న యాంకర్లే జాగ్రత్తలు తీసుకోవాలని ఒక సూచన కూడా చేసింది.
బి జే పి అధికార ప్రతినిధి నుపూర్ శర్మ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా వివాదాస్పదం కావడం దీనికి నేపథ్యమని విడిగా చెప్పాల్సిన పనిలేదు.
సుప్రీం కోర్టు సూచనలు రోజువారీ ప్రత్యక్షప్రసారాల చర్చల్లో ఎంతవరకు సాధ్యమన్న విషయం మీద ఇంగ్లీషు, హిందీ ఛానెళ్లు విస్తృతంగా చర్చాకార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
కేంద్రం ఇప్పటివరకయితే మీడియాలో విద్వేషాల ప్రసంగాలను ఆపడానికి చట్టం తెస్తాము అనికానీ…తీసుకురాలేము అనికానీ చెప్పినట్లు లేదు.
ఇందులో సాధ్యాసాధ్యాలు చాలా ఉన్నాయి. రికార్డెడ్ ప్రోగ్రాం అయితే ఏవయినా మాటలను ఎడిట్ చేయవచ్చు. ప్రత్యక్షప్రసారంలో ఎవరయినా ఉద్దేశపూర్వకంగా విద్వేష ప్రసంగం చేస్తే…మహా అయితే యాంకర్ అభ్యంతరం చెప్పవచ్చు. అప్పటికీ వినకపోతే మైక్ కట్ చేయవచ్చు. కానీ…ఈలోపు బయటికి వెళ్లాల్సిన మాటలు వెళ్లిపోతాయి. రాజుకోవాల్సిన అగ్గి రాజుకుంటుంది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. అప్పుడు యాంకర్ ను బాధ్యుడిని చేయడం ఎంతవరకు సబబు? యాంకర్ ఉద్దేశపూర్వకంగా అలాంటి చర్చను ప్రోత్సహిస్తే చర్యలు తీసుకోవచ్చు.
కేంద్రం నిజంగా చట్టం తెస్తే…అది మీడియా స్వేచ్ఛను అడ్డుకున్నట్లు అవుతుంది. బహుశా అందుకే సుప్రీం కోర్టు అడుగుతున్నా కేంద్రం నీళ్లు నములుతున్నట్లుంది.
మహా అయితే…అత్యంత సున్నితమయిన విషయాల్లో ఫలానా జాగ్రత్తలు పాటించండి అని సూచనలు చేయగలదేమో!
అనుకుంటాం కానీ…మీడియా సంస్థలే పార్టీల కొమ్ము కాస్తున్నప్పుడు; మీడియా సంస్థలను పార్టీలు కొనుగోలు చేస్తున్నప్పుడు; పార్టీలే నేరుగా మీడియా సంస్థలను నడుపుతున్నప్పుడు; మీడియాలో యాంకర్లు పార్టీల మీద ఇష్టానిష్టాలతో చెలరేగిపోతున్నప్పుడు…చట్టాలు, సలహాలు కాగితాల్లోనే ఉంటాయి.
కాకపొతే…అతి జాగ్రత్తలో అసలు చర్చే చర్చకు రాకుండాపోయే ప్రమాదం ఉంటుంది. అది అంతిమంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికే తూట్లు పొడుస్తుంది.
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :