పవన్ కళ్యాణ్ విచిత్రమైన ట్వీట్లు చేస్తున్నారని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. పవన్ కుంభకర్ణుడిలా ఆరు నెలలు నిద్రపోయి, ఆరు నెలలు మేల్కొంటారని, అప్పుడప్పుడు రాజకీయాల్లో దూరతారని, ఏదో ఒక ట్వీట్ చేయడమో, వచ్చి మీడియా సమావేశంలో ఏదో మాట్లాడి వెళ్లడమో చేస్తారని దుయ్యబట్టారు. చంద్రబాబుకి దత్తపుత్రుడిగా ఉన్నారన్నారు.
ఉత్తరాంధ్ర ప్రజలు వలస వెళుతున్నారంటూ పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఐదేళ్ళు బాబు, బిజెపితో కలిసి ఉన్న పవన్ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏం చేశారని ప్రశ్నించారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదంటూ గతంలో మాట్లాడిన పవన్ ఇప్పుడు ఏ ప్యాకేజీ ముట్టిందని మాట మార్చారని నిలదీశారు. చంద్రబాబు బినామీ లింగమనేని తన ఆఫీసుకు భూములు ఇచ్చారు కాబట్టి వాటికి రేట్లు పడిపోకూడదని ఇలా అంటున్నారని రోజా ఫైర్ అయ్యారు. ఒక పార్టీ పెట్టడం కాదని, ఓ సీరియస్ పోలిటీషియన్ గా ఉండి, మంచిని ఆహ్వానించాలని సలహా ఇచ్చారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
మూడు రాజధానులతో మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని, గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయకూడదనే… ఓ తండ్రి మనసుతో సిఎం జగన్ సంకల్పించారని రోజా అన్నారు. ప్రభుత్వ విధానంపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేస్తూ రెచ్చగొడుతోందని, పాదయాత్ర చేసేవారు తొడలు కొట్టుకుంటూ వైజాగ్ వైపు వెళుతున్నారని రోజా విమర్శించారు. 29 గ్రామాల కోసం 26జిల్లాలను పణంగా పెట్టాలంటే ఎవరూ ఒప్పుకొనే ప్రసక్తే లేదన్నారు. అది మరావతి ఉద్యమం కాదని, అత్యాశాపరుల ఉద్యమం అని వ్యాఖ్యానించారు. అమరావతిలో అన్నీ తాత్కాలిక భవనాలే తప్ప ఒక్క శాశ్వత మైన అభివృద్ధి కూడా చేయని చంద్రబాబు, ఇప్పుడు తామేదో నష్టం చేస్తున్నట్లు మాట్లాడడం సరికాదన్నారు.
Also Read : దేనికి గర్జనలు?: జనసేనాని వరుస ట్వీట్లు