Fake Astrologer :
ఒకప్పుడు జీవితాలనుంచి సినిమా కథలు పుట్టేవి. ఇప్పుడు సినిమా కథలను తలదన్నుతున్నాయి నిజ జీవిత కథలు. రంగుల కలల్లో మునిగితేలుతూ రాళ్ల పాలవుతున్నాయి జీవితాలు. ఈ పాపం ఎవరిది?
సామాజిక బాధ్యతతో పనిచేసే వార్తాపత్రికలు, టీవీ ఛానెళ్లకు కొదవలేదు మనకు. పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు రకరకాల ప్రకటనలతో ఊదరకొడుతూ ఉంటాయి. అది వారి ఆదాయ మార్గం. కాదనడానికి లేదు. కానీ మూఢనమ్మకాలు, అశాస్త్రీయ విధానాలు పెంచి పోషిస్తేనే అభ్యంతరం.
జాతకాలు చెప్పడం, ఆయా దోషాలకు తాయెత్తులు, విలువైన రాళ్లు ధరించడం పరిష్కారమనే ప్రకటనలు గంటల తరబడి వస్తున్నాయి. మానవ బలహీనతే పెట్టుబడిగా సాగే ఈ వ్యాపారంలో మీడియాది ప్రధాన పాత్ర. ఓ పక్క నకిలీ బాబాలు, స్వాముల బండారాలు బయటపెట్టేదీ వీరే. వారు చేసే మోసపు వ్యాపారాలకు ప్రకటనల వేదిక కల్పించేదీ వీరే.
మానవ స్వభావం చంచలం. ఎక్కువగా నమ్మకాలపైనే ఆధారపడుతుంది. ముఖ్యంగా కష్టాలు, కన్నీళ్లతో సహవాసం చేసేవారు ఏదో ఒక ఆధారం కోసం చూస్తూ ఉంటారు. ఒక రాయితోనో, తాయెత్తు లేదా పూజలతో సమస్య తీరుతుందంటే అప్పో సప్పో చేసయినా కొంటారు. ఈ నిస్సహాయతే చాలామంది మోసగాళ్లకు ఆధారం. వీరు ఏ శాస్త్రం చదవరు. ఏవో నాలుగు ముక్కలు నేర్చుకుంటారు. జ్యోతిష్కులు, బాబాల అవతారంతో దోచుకోవడం మొదలెడతారు. పట్టుబడి జైలుకి వెళ్లి వచ్చినా మార్పు ఉండదు. పేర్లు మార్చి మళ్ళా ప్రకటనలు ఇచ్చి మోసాలు మొదలెడతారు. అలవాటయిన ప్రాణం మరి!
ఈ మధ్య తెలంగాణలో ఇలాగే ఒక నకిలీ జ్యోతిష్కుడు పట్టుబడ్డాడు. విజయవాడలో రంగురాళ్ళతో మొదలైన ఇతగాడి యవ్వారం హైద్రాబాదులో నకిలీ నోట్ల చలామణి వరకు పాకింది. అతనికంటే ఘనుడు … అన్నట్టు ఇతగాడి దగ్గర పనిచేసేవాళ్ళు ఆ నకిలీ నోట్లు నిజమని నమ్మి, ఎత్తుకెళ్ళడంతో మొదలైంది కథ. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న జ్యోతిష్కుడు విలువైన రాళ్లు పోయాయని ఫిర్యాదు చేశాడు. ఈలోగా తాము ఎత్తుకెళ్ళినవి నకిలీ నోట్లని తెలుసుకున్న వాళ్ళు అన్నీ కాల్చేశారు. వాళ్ళని పట్టుకున్న పోలీసులకు నకిలీ జ్యోతిష్కుడి లీలలు, బ్యాంకుని సైతం బోల్తా కొట్టించిన విషయం తెలిశాయి.
ప్రస్తుతం అతగాడు జైల్లో ఉన్నాడు సరే, మోసపోయినవారి మొత్తానికి బాధ్యత ఎవరిది? శాస్త్రం తప్పు చెప్పక పోయినా స్వార్ధానికి వాడుకుంటున్న నకిలీలదా? ఇటువంటివారిని డబ్బుకోసం ప్రోత్సహించే మీడియాదా? వీటన్నిటినీ చూడనట్టు వదిలేసే ప్రభుత్వానిదా? ఓ మహాత్మా! ఓ మహర్షీ!
-కె. శోభ
Must Read : ఆన్ లైన్ దోపిడీ