రాహుల్ గాంధీ 3560 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు, దేశ చరిత్ర అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. రాహుల్ పాదయాత్ర విజయవంతం అవుతోందన్నారు. రాహుల్ గాంధి భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్ ఇందిరా భవన్ లో టీపీసీసీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్…యువకులు, ప్రజలు స్వచ్ఛందంగా రాహుల్ యాత్రకు తరలి వస్తున్నారన్నారు. దేశం గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని, దేశంలో ప్రజల కోసం ఇంతవరకు ఏ నాయకుడు ఇలాంటి సాహసం చేయలేదని వేణుగోపాల్ అన్నారు. దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, ప్రజల కోసం రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని, ఉదయం 4 గంటలకే నిద్ర లేచి రోజు 25 కిలోమీటర్ల యాత్ర చేస్తున్నారని చెప్పారు.
భారత్ జోడో యాత్రపై విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు వేణుగోపాల్ పిలుపు ఇచ్చారు. జన సమీకరణ కోసం చర్యలు తీసుకోవాలని., కల్చరల్ యాక్టివిటీస్ కోసం కమిటీలను వేసుకోవాలని సూచించారు. రైతులు , ఆశా వర్కర్లు, వివిధ వర్గాలను రాహుల్ గాంధీతో ఇంటరాక్షన్ కోసం ప్రత్యేక కమిటీని నియమించాలన్నారు. ప్రతి గ్రామంలో రాహుల్ గాంధి పాదయాత్ర పైన చర్చ జరగాలని, స్థానిక అంశాలపై ఆయా సంఘాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక గ్రూప్ లతో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని, శనివారం నాటికి రాహుల్ పాదయాత్ర 1000 కి.మీ కు చేరుకుంటుందన్నారు.
బీజేపీ, సంఘ్ పరివార్ రాహుల్ యాత్రపై దుష్ప్రచారం చేస్తున్నారని వేణుగోపాల్ మండిపడ్డారు. రాహుల్ ను వారు డీమోరల్ చేయాలని చూసినా.. ప్రజలు రాహుల్ డైనమిజంను చూస్తున్నారన్నారు. గతంలో రాహుల్ మీద మాట్లాడిన వారు ఇప్పుడు ఆయన సాహసంతో చేస్తున్న యాత్ర ను చూసి భయపడుతున్నారని, తెలంగాణలో కాంగ్రెస్ ఐక్యంగా ఉందని ఈ యాత్ర ద్వారా చాటిచెప్పాలని చెప్పారు. ఒక్కరు పని చేస్తే విజయం సాధించము.. అంత కలిసికట్టుగా పని చేయాలని కాంగ్రెస్ నేతలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.
Also Read : నీట్ పరీక్షలో సంస్కరణలు తీసుకోస్తాం – రాహుల్ గాంధీ