కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు ఈ ఉదయం వార్తలు వినిపించాయి. అయితే మధ్యాహ్నం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఈసీ.. కేవలం హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, గుజరాత్ ఊసెత్తలేదు. హిమాచల్‌ప్రదేశ్‌లో నవంబర్ 12న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపింది.
డిసెంబర్ 8న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నట్లు వెల్లడించింది. అంటే పోలింగ్‌కు ఫలితాల విడుదలకు మధ్య 26 రోజుల సమయం ఉన్నందున.. రేపో, ఎల్లుండో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. గుజరాత్‌లో విడతల వారీగా పోలింగ్ నిర్వహించడానికి అనువుగా ఈసీ హిమాచల్ కౌంటింగ్ తేదీని డిసెంబర్ 8గా నిర్ణయించినట్లు తెలుస్తుంది.
కాగా, ఈసీ వెల్లడించిన ప్రకారం.. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 17న నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 25 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఇస్తారు. అక్టోబర్ 27 వరకు నామినేషన్‌లను పరిశీలిస్తారు. అక్టోబర్ 29 వరకు నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఇవ్వనున్నారు.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 8 కాగా గుజరాత్ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 18 వ తేది . ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రభావం గుజరాత్ మీద పడకుండా ఈ వారం రోజుల్లో షెడ్యుల్ ప్రకటించే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం డిసెంబర్ 8 వ తేదీనే వెలువడతాయి.