ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని, తాము విశాఖ రాకముందే గొడవ జరిగితే, తాము రెచ్చగొట్టడం వల్లే గొడవ జరిగిందని నోటీసులో చెప్పడం విడ్డూరంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ అన్నారు. తాము యుద్దానికి సిద్ధంగా ఉన్నామని, అరెస్ట్ అవ్వటానికి కూడా సిద్ధమని ప్రకటించారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ తో పాటు ఆ పార్టీ నేతలకు పోలీసులు 41 A నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయింత్రం 4 గంటలోగా నగరం నుండి వెళ్లిపోవాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ నెలాఖరు వరకూ 30 యాక్ట్ అమల్లో ఉందని… సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.
సవాళ్ళను ఎదుర్కొనేందుకు తాము తయారుగా ఉన్నామని, ‘మా ఇంట్లో మేము ఉంటే కూడా శాంతి భద్రతల సమస్య వస్తుందని అంటారేమో’ అని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో బలహీనుల విషయంలో లా అండ్ ఆర్డర్ బలంగా పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. అడిగేవాళ్ళు లేరని ఇష్టమొచ్చినట్లు చేస్తున్నారని విమర్శించారు. తాము ప్రజల కోసం గొంతెత్త కూడదా, ప్రభుత్వాన్ని ప్రశ్నించ కూడదా అని పవన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజలకు కోపం రాదు- నాయకులకు ధైర్యం లేదు, రెండు చోట్లా ఓడిపోయినంత మాత్రాన మాట్లాడ కూడదా అని పవన్ అడిగారు.
ఉత్తరాంధ్ర పర్యటనను మూడు నెలల క్రితమే నిర్ణయించుకున్నామని, మేము ఎలా నడవాలో వైసీపీ నేతలు ఎలా చెబుతారని పవన్ అసహనం వ్యక్తం చేశారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను మీడియా, ప్రభుత్వం దృష్టికి తీసుకు వస్తున్నామని ఇది తప్పేలా అవుతుందన్నారు. 151మంది ఎమ్మెల్యేలు ఉంది ప్రజల సమస్యలు పరిష్కరించడం లేదని, అందుకే తాము ఈ క్రార్యక్రమం చేపట్టామని వెల్లడించారు.
రాజధాని అనేది ప్రస్తుత తన పర్యటనలో అంశం కాదని, ఈ విషయమై తమ పార్టీ విధానం ఏనాడో ప్రకటించామని, అమరావతి రాజధాని గా ఉండాలన్నదే తమ అభిమతమని చెప్పారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారుస్తామంటే ఎలా అని పవన్ ప్రశ్నించారు.
Also Read: పవన్ మీడియేషన్: సజ్జల అనుమానం