వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో తలపెట్టిన గర్జన విజయ వంతం కావడంతో రాయల సీమ ప్రాంతంలోనూ ఈ అంశానికి మద్దతు ఉందన్న విషయాన్ని రుజువు చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఈ మేరకు తిరుపతిలోనూ ఓ సభను ఏర్పాటు చేసింది. మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 29న తిరుపతిలో ఆత్మా గౌరవ సభ నిర్వహిస్తున్నల్టు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. రాయలసీమ గొంతుకను ఈ ప్రదర్శన ద్వారా చాటిచెబుతామని స్పష్టం చేశారు. కర్నూలుకు న్యాయ రాజధానితో సీమ అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు.
రాష్ట్రంలో ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడ్డాయని అందుకే సిఎం జగన్ ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ నిర్ణయాన్ని రాజకీయాలకు వాడుకోవడానికి బాబు ప్రయతిస్తున్నారని భూమన ఆరోపించారు. ప్రాంతాలను రెచ్చగొట్టేలా అమరావతి ధనిక రైతుల పాదయాత్ర సాగుతోందని, చంద్రబాబు చర్యలు రాయలసీమ వాసులను మానసిక క్షోభకు గురి చేస్తున్నాయని విమర్శించారు.
వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ సీమ అభివృద్దిని పట్టించుకున్న నాయకుడే లేదని, సీమకు కావాల్సిన నీటిపారుదల ప్రాజెక్టులపై అత్యంత శ్రద్ధ పెట్టి పోతిరెడ్డి పాడు ద్వారా వైఎస్ నీరు అందించారని భూమన గుర్తు చేశారు.
Also Read : విశాఖ గర్జనకు పోటెత్తిన జనం