పాదయాత్రపై అంక్షలు ఎత్తివేయాలంటూ అమరావతి రైతులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు సింగిల్ బెంచ్ తిరస్కరించింది. రెగ్యులర్ బెంచ్ కు వెళ్లాలని ఆదేశించింది. అమరావతి నుంచి అరసవిల్లి వరకూ తాము చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని, అధికార పార్టీ నేతలు పోటీ యాత్రలు చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు గత శుక్రవారం తీర్పు ఇస్తూ యాత్రలో 600 మంది రైతులకు మించి ఉండకూడదని, సంఘీభావం తెలియజేయాలనుకునే వారు రోడ్డుకు ఇరువైపులా నిలబడి యాత్రకు మద్దతు తెలపాలని సూచించింది. పాదయాత్ర సమయంలో దానికి పోటీగా ఇతరులు యాత్రలు చెప్పకుండా చూడాలని పోలీసులను ఆదేశించింది. శనివారం పాదయాత్ర ప్రారంభ సమయంలో పాదయాత్రలో పాల్గొనేవారు ఐడి కార్డులు చూపించాలని పోలీసులు కోరారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేసి పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఆంక్షలు సడలించాలని కోరుతూ నిన్న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా నేటి ఉదయం సింగల్ బెంచ్ దీన్ని విచారించింది. రైతుల వాదనను తిరస్కరిస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లాలని సూచన చేసింది. వచ్చే మంగళవారం దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.
Also Read :దాన్ని పాదయాత్ర అంటారా? శ్రీకాంత్ రెడ్డి