టి20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై సౌతాఫ్రికా 105పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ రీలీ రోస్సో 56బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 109; ఓపెనర్ క్వింటన్ డికాక్ 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ కు206 పరుగుల భారీ లక్ష్యాన్ని పెట్టింది. కానీ బంగ్లా దేశ్ 16.3ఓవర్లలో 101పరుగులకే ఆలౌట్ అయ్యింది. జింబాబ్వేతో జరిగిన గత మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో కేవలం ఒక పాయింట్ తోనే సరిపెట్టుకున్న సౌతాఫ్రికా జట్టుకు ఈ భారీ విజయం ఊరట ఇచ్చింది.
పెర్త్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు పరుగులకే ఓపెనర్, కెప్టెన్ బావుమా(2) వెనుదిరిగాడు. రెండో వికెట్ కు డికాక్-రోస్సో 168 పరుగులు జోడించారు.వీరిద్దరూ ఔటైన తర్వాత స్టబ్స్(7), మార్ క్రమ్ (10) కూడా వెనుదిరిగారు. మిల్లర్(2), పార్నెల్(0) క్రీజులో ఉన్నారు. ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.
బంగ్లా బౌలర్లలో కెప్టెన్ షకీబల్ హసన్ రెండు; తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మూద్, అఫిఫ్ హుస్సేన్ తలా ఒక వికెట్ సాధించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 26పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జట్టులో లిట్టన్ దాస్-34; సౌమ్య సర్కార్-15; హసన్ మిరాజ్-11; టస్కిన్ అహ్మద్-10 మాత్రమే రెండంకెల స్కోరు దాటారు.
సౌతాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నార్త్జ్ నాలుగు; టబ్రైజ్ శంషి మూడు; రబడ; కేశవ్ మహారాజ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ టోర్నమెంట్ లో తొలి సెంచరీ సాధించిన రోస్సోకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ICC Men’s T20 World Cup 2022: న్యూజిలాండ్- బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షార్పణం