ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే జమ్ముకశ్మీర్‌లో హిందువులు లేకుండా పోతారని మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇటీవల కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకోవడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఫరూక్ అబ్దుల్లా, 1990 నాటి పరిస్థితులను కశ్మీరీ పండిట్లు తిరిగి ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కశ్మీర్ వంద శాతం హిందూ రహితమవుతుందని చెప్పారు.
కాగా, కశ్మీర్ పండిట్ల హత్యలకు తాను బాధ్యుడ్ని కాదని, ఉగ్రవాదానికి మద్దతుగా తాను ఈ వ్యాఖ్యలు చేయడం లేదని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే దీనిపై దృష్టి పెట్టాలన్నారు. అలాగే కశ్మీరీ పండిట్లు, మైనార్టీ హిందువులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని చంపుతుండటంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని ఆయన సూచించారు.
మరోవైపు ఉగ్రవాదులు తమను లక్ష్యంగా చేసుకోవడంపై కశ్మీరీ పండిట్ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల చౌదరిగుండ్ ప్రాంతంలో పురాణ్ క్రిషన్ భట్‌ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు హత్య చేయడంతో దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ నుంచి సుమారు పది కశ్మీరీ పండిట్ కుటుంబాలు వెళ్లిపోయాయి. అయితే కశ్మీరీ పండిట్ కుటుంబాలు పోతున్నట్లు వస్తున్న వార్తలను షోపియాన్ అధికారులు ఖండించారు.