వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తాము ఎవరినీ అందలం ఎక్కించడానికి ఇక్కడ లేమని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజలను అందలం ఎక్కించడానికే ఉన్నామని పునరుద్ఘాటించారు. దీనికోసం తన వ్యూహాలు తాను వేస్తానని, అవి ఎప్పుడూ ప్రజలను దృష్టిలో ఉంచుకునే ఉంటాయి కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని వ్యాఖ్యానించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది, దీనిలో పాల్గొన్న పవన్ ఆ తరువాత మీడియాతో మాట్లాడారు.
త్వరలోనే పార్టీ పరంగా కార్యక్రమాలు ప్రకటిస్తామని, ఉత్తరాంధ్ర నాయకత్వాన్ని కూడా వెల్లడిస్తామని పవన్ తెలిపారు. విశాఖ ఘటనలో జైలుకు వెళ్లి వచ్చిన తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఏమాత్రం దిగులు పడకుండా, హక్కుల కోసం పోరాడి జైలుకు వెళితే ఇంత తృప్తి ఉంటుందని తాము అనుకోలేదని వారు చెబుతుంటే ఆశ్చర్యం వేసిందన్నారు.
పవన్ ప్రసంగంలోని ఇతర ముఖ్యాంశాలు:
- వైసీపీ విశాఖపట్నం కేంద్రంగా విధ్వంసం చేయాలని చూస్తోంది
- అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోంది
- వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.
- దీనిలో భాగమే ఈ నెల 15వ తేదీన జరిగిన జనసేనపై ఆంక్షలు…
- ఉత్తరాంధ్రపై నాకున్న ప్రేమ మాటల్లో వ్యక్తం చేయలేనిది.
- సిక్కోలు ఉద్యమం నాకు పోరాట అడుగులు నేర్పితే, అక్కడి ఆటపాట నన్ను చైతన్యవంతుడ్ని చేశాయి.
- అధికార పార్టీకే భావ స్వేచ్ఛ ఉంటుంది అని రాజ్యాంగం లో ఎక్కడైనా ఉందా?
- మీకేమి కొత్తగా కొమ్ములు పుట్టుకు రాలేదు. మీకేమి కొత్తగా రాజ్యాంగం లేదు.
- వైసీపీ తీరుకు చెప్పు చూపించక ఏం చూపించాలి?
- పెద్ద స్థాయి అధికారులు కూడా వంగి వంగి సలాం చేస్తుంటే చెప్పు చూపించక ఏం చూపించాలి?
- అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు చేస్తాం