మునుగోడులో జరుగుతోంది కురక్షేత్రమే. ఈ యుద్దంలో ధర్మం బీజేపీవైపే ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మునుగోడు గడ్డపై ఎగిరేది కాషాయ జెండానే అన్నారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్, టీఎన్జీవో నాయకులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. సీఎం మోచేతి నీళ్లు తాగుతూ ఉద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి అక్రమాస్తులు కూడగట్టిన ఆ ముగ్గురు టీఎన్జీవో నాయకుల బండారం బయటపెడతానని హెచ్చరించారు. మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జె.సంగప్ప తదితరులతో కలిసి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు..
అందులోని ముఖ్యాంశాలు..
ఉప ఎన్నికల ప్రచారం సాయంత్రంతో ముగియబోతోంది. ఇన్ని రోజులు బీజేపీ కార్యకర్తలు, నాయకులు కష్టపడి ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రచారం చేశారు. కోదాటి శ్రీనన్న రాసిన సూడు సూడు నల్లగొండ పాటను కూడా తానే రాసినట్లు చెప్పుకున్న దొంగ కేసీఆర్… ఇట్లనే పోతే ఆఖరికి జాతీయ గీతం జనగణమన కూడా నేనే రాసినని చెప్పుకుంటడు. చేనేతపై జీఎస్టీ వేయాలని చెప్పింది టీఆర్ఎస్సే.. డ్రంకన్ డ్రైవ్ పెట్టి గౌడన్నలకు ఉపాధి లేకుండా చేస్తున్నవ్.. తాటిచెట్లు ఎక్కి చనిపోతున్నా కనీస సాయం చేయట్లేదు. గొల్ల కురమలను దారుణంగా మోసం చేస్తున్నవ్.. వాళ్ల ఖాతాలో వేసిన సొమ్మును ఫ్రీజ్ చేసిండు.. ఎన్నికల తరువాతనైనా ఇస్తానని కనీసం మాట మాత్రంగానైనా చెప్పలే…
కేసీఆర్ నీకు దమ్ముంటే… మునుగోడులో ఎంతమంది యువతకు ఉద్యోగాలిచ్చినవో శ్వేత పత్రం విడుదల చెయ్… ఏమీ మాట్లాడకుండా దొంగలెక్క వచ్చి పోయిన కేసీఆర్… సర్కస్ లో జంతువుల మాదరిగా ఆ 4గురు ఎమ్మెల్యేలను తీసుకొచ్చి వెంట బెట్టుకుపోయినవ్. అసలు మీ అభ్యర్ధి ఎక్కడ? దొంగ లెక్క తిరుగుతున్నడా? మా బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొనగాడు.. కేసీఆర్ గల్లా పట్టి గుంజుకొచ్చిన మొనగాడు కావాలా? గడీల దగ్గర కాపాలా కాసేటోడు కావాల్నా? అని మునుగోడు ప్రజలు చర్చించుకున్నరు.
కొంతమంది టీఎన్జీవో నాయకులు ఉద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్నరు. నేను వాళ్లకు క్షమాపణ చెప్పాల్నా…. మీరే ముక్కు నేలకు రాసి ఉద్యోగులకు క్షమాపణ చెప్పలి. పొర్లు దండాలు చేయాలే.. మీ స్వప్రయోజనాల కోసం, మీ ప్రమోషన్లు, పైరవీల కోసం సీఎం దగ్గర మోకరిల్లినరు. మీ సంగతి చూస్తాం… మీ బండారం బయటపెడతాం… ఏసీబీకి పట్టుబడ్డోళ్లు… మీరు… ఏనాడైనా ఉద్యోగుల మనోభావాలను పట్టించుకున్నరా? వాళ్ల సమస్యలు పట్టించుకున్నరా? అందుకే మిమ్ముల్ని పక్కా తిడతా… సీఎం మోచేతి నీళ్లు తాగే బానిస బతుకులు బతుకున్న ఆ కొద్దిమంది టీఎన్జీవో నాయకులు.
హెచ్ఆర్ సీ తగ్గిస్తే కూడా నోరు మెదపని దద్దమ్మలు.. బీజేపీ పోరాడితే తప్ప జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ఉంటే ఎన్నడైనా సర్కార్ ను నిలదీశారా? మీకేమో కోట్ల ఆస్తులున్నయ్… కానీ ఉద్యోగులు సక్రమంగా జీతాలు రాకపోతే లోన్లు కట్టలేక, కిరాయి కట్టలేక అల్లాడుతున్నరు.. 3 డీఏలు ఇయ్యలే.. సరెండర్ లీవ్స్ లేవు.. 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిండ్రు.. ఎందుకు నిలదీయలే… వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నయ్… ఏండ్ల తరబడి నియామకాల్లేవు… నిరుద్యోగ యువత అల్లాడుతున్నరు. మీరెందుకు ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగిన పాపానికి అరెస్ట్ చేసి ఇయాళ స్టేషన్ కు తీసుకెళ్లిండ్రు.
నేను బరాబర్ మాట్లాడతా.. ఉద్యోగుల కోసం జైలుకు పోయిన. 317 జీవో కు వ్యతిరేకంగా పోరాడిన జైలుకు పోయిన. మా కార్యకర్తలు లాఠీ దెబ్బలు తిన్నరు… కేసులు ఎదుర్కొంటున్నరు.. యాడ పోయిండ్రు ఈ సోకాల్డ్ టీఎన్జీవో నాయకులు. స్కూళ్లలో 20 వేల స్కావెంజర్లను తీసేసి చదువు చెప్పే హెడ్మాస్టర్లతో బాత్రూంలు కడిగిస్తున్న మూర్ఖులు వీరు.. మీరు రండి బాత్రూంలు కడగడానికి? డీఈవో, ఎంఈవో, హెడ్మాస్టర్ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నయ్. ఎందుకు కొట్లాడటం లేదు? పీఆర్సీ గురించి అడగరు? ఒక్కసారి క్షేత్రస్థాయిలోకి పోయి ఉద్యోగులు ఏమనుకుంటున్నరో.. ఎందుకు ఆలోచించరు.. డీఏల్లేవు, బెన్ ఫిట్స్ లేవు.. క్రమశిక్షణ కలిగిన పోలీస్ వ్యవస్థలో ఉండి మాట్లాడలేని దుస్తితి.. రాత్రింబవళ్లు తిండి తిప్పల్లేక అల్లాడుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు. మహిళా సిబ్బంది గోసం వర్ణణాతీతం.
ఈ ముగ్గురు, నలుగురు టీఎన్జీవో నాయకులారా.. నోరెందుకు విప్పరు? ఏసీబీ కేసులో అడ్డంగా దొరికినోడు ఇయాళ మంత్రులైండ్రు. మీ జెండాలు కలిసినయ్… పార్టీలు కలిసినయ్.. సంతోషమే.. కానీ కొంతమంది మనసులు కూడా కలిసినయ్… మీ సంగతి తెల్వదా? నన్ను కెలికితే మీ బండారం బయటపెడతా…మీ సంగతి చూస్తా. ఇప్పటికైనా మీరు క్షమాపణ కోరండి.. ఇన్నాళ్లు సీఎం దగ్గర మోకరిల్లినం… తప్పు చేసినమని చెప్పండి. మీరు ధర్నా చేస్తే పిడికెడు మంది ఉద్యోగులు కూడా మీకు మద్దతియ్యలేదు.. సోషల్ మీడియాలో మిమ్ముల్ని బూతులు తిడుతున్నా మీకు సిగ్గు రావడం లేదు. మీ వార్తలను బూతు పత్రికలో రాసుకుని సంతోషించడం తప్ప మీరు చేసిందేమిటి? ఇయాళ మీ వల్ల బలిదానమైన ఉద్యోగుల ఆత్మ ఘోషిస్తున్నయ్. ఉద్యోగులారా… మీకు జరిగిన అన్యాయానికి మునుగోడు ఎన్నికల ద్వారా ప్రతీకారం తీర్చుకోండి.
ఏనాడు ఈటల రాజేందర్ ఆవేశంగా మాట్లాడరు. సంయమనంతో మాట్లాడతారు.. అందుకే హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదించారు. అట్లాంటోడు పలివెలలో మాట్లాడుతుంటే టీఆర్ఎస్ గూండాలు దాడి చేసిర్రు. బిడ్డా.. మేం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలం. మా సంయమనాన్ని, సహనాన్ని పిరికితనంగా భావించొద్దు. ఇక్కడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసు అధికారులతే బాధ్యత. సీఎం కూడా మిమ్ముల్ని కాపడలేరు. చివరిసారిగా విజ్ఝప్తి చేస్తున్న… అభ్యర్థులను బేరీజు వేసుకోండి. మునుగోడు అనాథ కానీయకండి… రాజగోపాల్ రెడ్డి గెలిస్తే అండగా ఉంటూ ఆపదలో ఆదుకుంటడు.. టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే కేసీఆర్ గడీల వద్ద కాపాల ఉండే బానిసగా మారతడు.. ఎవరు కావాలో ఆలోచించి ఓటేయండి.
Also Read : డబ్బుల వివరాలు ఎందుకు బయటపెట్టలేదు – బండి సంజయ్