పురుషుల టి 20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో ఇంగ్లాండ్ నిలిచింది. తప్పనిసరిగా గెలవాల్సిన నేటి మ్యాచ్ లో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణించి న్యూజిలాండ్ పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ విసిరిన 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 159 పరుగులు చేయగలిగింది.
బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచిబ్యాటింగ్ ఎంచుకుంది. తొలి వికెట్ కు 81 పరుగులు జోడించింది. హేల్స్ 40 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సర్ తో 52 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మోయిన్ అలీ (5); హ్యారీ బ్రూక్ (7); బెన్ స్టోక్స్ (8) విఫలమయ్యారు. లివింగ్ స్టోన్ ఒక్కడే 14 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్, కెప్టెన్ జోస్ బట్లర్ 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 73 పరుగులు చేసి 19వ ఓవర్లో రనౌట్ అయ్యాడు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగులు చేసింది.
కివీస్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ రెండు; సౌతీ, శాంట్నర్, ఇష్ సోది తలా ఒక వికెట్ పడగొట్టారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఎనిమిది పరుగులకే ఓపెనర్ డెవాన్ కాన్వే(3)వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ఫిన్ అల్లెన్ (16) కూడా త్వరగా ఔటయ్యాడు. ఈ స్థితిలో కెప్టెన్ కేన్ విలియమ్సన్- గ్లెన్ ఫిలిఫ్స్ లు మూడో వికెట్ కు 91 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. విలియమ్సన్ 40 స్కోరు చేసి పెవిలియన్ చేరాడు. జేమ్స్ నీషమ్ (6); డెరిల్ మిచెల్ (3) విఫలమయ్యారు. గ్లెన్ ఫిలిప్స్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసి 18వ ఓవర్లో ఔట్ కావడంతో కివీస్ కు ఓటమి తప్పలేదు.
ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ ఓక్స్, శామ్ కరణ్ చెరో రెండు; మార్క్ వుడ్, బెన్ స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు.
జోస్ బట్లర్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ICC Men’s T20 World Cup 2022 : ఆఫ్ఘన్ పై శ్రీలంక విజయం