సినిమాతారలు తమ అందచందాలతో, నటనతో అభిమానులను సంపాదించుకుంటారు. కానీ మానవత్వం, మంచితనం కలబోసిన నిలువెత్తు హీరో మాత్రం కృష్ణ మాత్రమే. అందుకేనేమో ఉన్నన్నాళ్లూ అమ్మ కడుపు చల్లగా , అత్త కడుపు చల్లగా పచ్చగా బతికారు.
నాకు ఊహ తెలియని వయసు నుంచి తెలిసిన హీరోలు ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ. చాలామంది కజిన్స్ వీళ్ళ గురించి గొడవ పడుతూ ఉండేవారు. అలా చిన్నతనం నుంచి సూపర్ స్టార్ కృష్ణ విషయాలు తెలుకుంటూ పెరిగాను. మొదట్లో అందరిలాగే ఆయన నటన, డాన్స్ గురించి వెక్కిరింపుగా మాట్లాడేదాన్ని. ఇమిటేట్ చేసేదాన్ని కూడా. కానీ మెల్లగా ఆయన మంచితనం గురించి తెలిసింది. అల్లూరి సీతారామరాజు సినిమా కథ వింటేనే ఏడుపువచ్చేది. తనను నమ్ముకున్నవారందరినీ ఆదుకునే ప్రత్యేకత ఈ హీరోదని తెలుసుకున్నా . అప్పటినుంచి ఏ రకంగానూ విమర్శించలేదు.
కృష్ణ ఫాన్స్ లో కూడా ఆ మంచితనం కనిపించేది. మాకు తెలిసిన గ్రేట్ ఫ్యాన్ వసంతరావు అనే ఫ్యామిలీ ఫ్రెండ్ ఆ రోజుల్లోనే అందర్నీ కృష్ణ సినిమాలకు తీసుకెళ్లేవారు. ఇంటర్లో ఉండగా ఒక ఫ్రెండ్ కృష్ణ వీరాభిమాని. ఎవరికే సహాయం కావాలన్నా చేసేది. సినీ హెరాల్డ్ పత్రికలో పనిచేసిన నాన్నద్వారా కృష్ణ గారి గురించి ఎన్నో విషయాలు విన్నాను. దాంతో కృష్ణ నిజమైన హీరో అని అర్థమైంది. చాలా చిన్న వయసులో ఉండగా పాడిపంటలు షూటింగ్ కి వెళ్లడం బాగానే గుర్తు ఉంది.
సూపర్ స్టార్ తో కలసి మా నాన్న కూచి గోపాలకృష్ణ సావాసగాళ్లు సినిమాలో నటించారు. హైదరాబాద్ లోనే ఉన్నా ఎప్పుడూ ఆయన్ని కలవలేదు. కలిసే ప్రయత్నమూ చెయ్యలేదు. విజయ నిర్మల పోయినపుడు కృష్ణ గారిని చూస్తే చాలా బాధగా అనిపించింది. బహుశా అప్పటినుంచీ ఆయన మానసికంగా కుంగిపోయినట్టున్నారు. ఆ తర్వాత పెద్దకొడుకు రమేష్, భార్య ఇందిర మరణించడం కోలుకోలేని విషయాలు. అపురూపమైన వ్యక్తిత్వం కలిగిన ఇటువంటి హీరోని పోగొట్టుకోవడం తీరని లోటు. అభిమానుల హృదయాల్లో ఆయన చిరంజీవి.
-కె. శోభ
Also Read :
Also Read :