వ్యక్తిగతంగా ఎవరు ఏ మతాన్ని అవలంబించినా, దేశాన్ని గౌరవిచాలన్నదే బిజెపి అభిమతమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. మతం అనేది వ్యక్తిగతమైనది, దేశం ప్రధానమైనదని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీకి ఒక కులం, మతం అంటూ ఏదీ ఉండదని, భారతీయత మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. బిజెపి ఒక సిద్ధాంతంతో కూడుకున్న రాజకీయ వ్యవస్థ అని దేశభక్తిని ప్రేరేపించడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. విజయవాడలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వీర్రాజు సమక్షంలో పలువురు పాస్టర్లు బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీలు వోట్ బ్యాంక్ రాజకీయాల కోసమే పనిచేస్తాయని, బిజెపి మాత్రం దేశం కోసం పనిచేస్తుందని వీర్రాజు చెప్పారు.
చర్చిల నిర్మాణానికి ప్రభుత్వ డబ్బులు వినియోగించాల్సిన అవసరం లేదన్నది బిజెపి విధానమని పేర్కొన్నారు. క్రైస్తవ మతంలో వారికి వారే డబ్బులు సమకూర్చుకుంటూ చర్చిలు నిర్మించుకుంటారని, హిందువులు కూడా భక్తులు ఇచ్చే కానుకలతో, విరాళాలతోనే దేవాలయాలు నిర్మిస్తూ వస్తున్నారని వీర్రాజు వివరించారు. ఈరోజు చేరిన పాస్టర్లు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని కోరారు.
హిందూయిజం అనేది ఒక జీవన విధానం మాత్రమేనని, హిందువులు పాములో, పుట్టలో, చెట్టులో, ప్రకృతిలో దేవుణ్ణి చూసుకుంటూ ఉంటారని, వారికి ప్రత్యేకంగా ఒక గ్రంథం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదని వీర్రాజు వెల్లడించారు. బిజెపి హిందువుల పార్టీ అని కొందరు ఆరోపిస్తున్తారని, అది కేవలం రాజకీయం కోసమేనని విమర్శించారు. భారతీయతలో ఒక విశాలమైన మనస్తత్వ శాస్త్రం ఉంటుందని చెప్పారు.