Death-Dignity:
“పాంచభౌతికము దుర్భరమైన కాయం బిదెప్పడో విడుచుట యెఱుకలేదు,
శతవర్షములదాఁక మితముఁ జెప్పిరి కాని,
నమ్మరాదామాట నెమ్మనమున
బాల్యమందో; మంచి ప్రాయమందో, లేక
ముదిమియందో, లేక ముసలియందొ,
యూరనో, యడవినో, యుదకమధ్యముననో,
యెప్పుడో యేవేళ నే క్షణంబొ?
మరణమే నిశ్చయము, బుద్ధిమంతుఁడైన
దేహ మున్నంతలో మిమ్ముఁ దెలియవలయు,
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!”
-నృసింహ శతకం, కవి శేషప్ప
“ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశానస్థలిన్
కన్నుల్ మోడ్చిన మందభాగ్యుడొకడైనన్ లేచి రాడక్కటా
ఎన్నాళ్ళీ చలనంబు లేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాగిపోయినవి నిక్కం బిందు పాషాణముల్”
“ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము, నిప్పులలోనఁగఱగిఁపోయె?
యిచ్చోట; నే భూము లేలు రాజన్యుని యధికారముద్రిక లంతరించె?
యిచ్చోట; నే లేఁత యిల్లాలి నల్లపూసలసౌరు,గంగలోఁగలిసిపోయె?
యిచ్చోట; నెట్టి పేరెన్నికం గనుఁగొన్న చిత్రలేఖకుని కుంచియ,నశించె?
ఇది పిశాచులతో నిటాలేక్షణుండు గజ్జె గదలించి యాడు రంగస్ధలంబు;
ఇది మరణదూత తీక్షణమౌ దృష్టు లొలయ నవనిఁ బాలించు భస్మసింహాసనంబు”
“ఆలోకించిన గుండియల్గరగు; నాయా పిల్ల గోరీలలో నే లేబుగ్గల సౌరు రూపరియెనో? యేముద్దు నిద్రించెనో? యే లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో? యీలోకంబున వృద్ధిగాదగిన యేయే విద్య లల్లాడునో?”
-శ్మశాన వాటిక, గుర్రం జాషువా
మనిషి ఆయుః ప్రమాణం నూరేళ్లు అని చెప్పారు కానీ…మధ్యలోనే ఎప్పుడయినా పోవచ్చు. బాల్యంలోనో, మంచి ప్రాయంలోనో, వృద్ధాప్యంలోనో…ఎప్పుడయినా పోవచ్చు. కాబట్టి నిండు నూరేళ్ల మాట నమ్మకండి…ఊళ్ళోనో, అడవిలోనో, నీళ్ళల్లోనో, రోడ్డు మీదో ఎప్పుడో…ఏ వేళో రాలిపోయే…మట్టిలో కలిసిపోయే మట్టి ప్రాణమిది అన్నాడు కవి శేషప్ప.
ఎన్నో ఏళ్లు గడిచాయి. ఈ శ్మశానంలో పడుకున్న ఒక్క మందభాగ్యుడయినా మళ్లీ లేచిరాలేదు. ఎన్నాళ్లు ఈ కదలిక లేని నిద్ర? ఏ తల్లులు విలపిస్తున్నారో? పోయినవారికోసం ఏడ్చినవారి కన్నీటిలో పడి రాళ్లు కూడా కరిగిపోయాయి.
ఇక్కడ కవి కలం, రాజు అధికార ముద్ర, లేత ఇల్లాలి మాంగల్యం, గొప్ప చిత్రకారుడి కుంచె మాడి మసై పోయాయి. ఇది పిశాచుల రంగస్థలం. భస్మ సింహాసనం మీద మృత్యువు పాలించే చోటు.
ఆలోచిస్తే…ఆయా పిల్ల సమాధుల్లో ఏ చిన్ని పాపల పాల బుగ్గల అందం మట్టి అయ్యిందో? ఎన్ని మూట కట్టిన ముద్దులు నిద్రిస్తున్నాయో? గర్భవతిగా చనిపోయిన కడుపులో పుట్టాల్సిన ప్రాణం పుట్టకుండానే నిప్పు కణికగా రగిలిపోయిందో? పుట్టి ఈ లోకంలో పెరగాల్సిన ఎన్నెన్ని విద్యలు పుట్టకుండానే చచ్చిపోయాయో? అని జాషువా గుండెలు బాదుకుని విలపించాడు.
బలిజేపల్లి లక్ష్మీకాంత కవి సత్యహరిశ్చంద్ర పద్య నాటకం కాటి సీన్లో ఈ జాషువా పద్యాలను ఏ క్షణంలో ఎవరు వాడడం ప్రారంభించారో కానీ...అప్పటి నుండి శ్మశానానికి ఈ పద్యాలు సిగ్నేచర్ ట్యూన్లు అయ్యాయి. బ్రాండ్ అంబాసిడర్లు అయ్యాయి. శ్మశాన వైరాగ్యాన్ని బోధించే పాఠాలయ్యాయి. శ్మశానం గురించి తెలుసుకోవాల్సిన సైద్ధాంతిక విషయాలకు దారి దీపాలయ్యాయి.
ఒక్కొక్క పద్యం ఒక మహా కావ్యంతో సమానం. నవయుగ కవిచక్రవర్తి జాషువా మాత్రమే చెప్పగలిగిన పద్యాలివి. శ్మశానమంటే భయమున్నవారు చదివి అర్థం చేసుకుని భయాన్ని పోగొట్టుకోవడానికి ఉపయోగపడే పద్యాలివి. వల్లకాటికి ఒక తాత్విక వేదాంత మహాయోగం కల్పించిన పద్యాలివి. ఇది అంటరాని శ్మశానం పాడే కన్నీటి పాట కాదు. మనం శ్మశానాన్ని అంటుకుని, అర్థం చేసుకుని ఓదార్చాల్సిన పాట.
భగవద్గీత చెప్పినా, కవి శేషప్ప చెప్పినా… “మరణమే నిశ్చయం”. మరణించిన తరువాత అంత్యక్రియలు ఒక సంస్కారం. మట్టిలో పూడ్చి పెట్టినా…కట్టెల మీద కాల్చినా...అంత్యక్రియలు తప్పనిసరి.
ఢిల్లీ ప్రగతి మైదాన్ ఎగ్జిబిషన్లో అంత్యక్రియల పనులన్నీ చేసిపెట్టే ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టాల్ వార్త దేశమంతా తెగ వైరల్ గా తిరుగుతోంది. నిజానికి మహా నగరాలతో పాటు ఎక్కడయినా అంత్య క్రియల పనులన్నీ సింగిల్ విండోలో చేసే ఏజెన్సీల అవసరం చాలా ఉంది.
ఈ అంత్యక్రియల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి “సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్” అని చక్కటి పేరు పెట్టారు. స్టాల్ ముందు వరిగడ్డి పరిచిన పాడె పెట్టారు. వీరు ఆఫర్ చేస్తున్న సేవల వివరాలు:-
1. శవ యాత్రకు వాహనం
2. ఉత్తర క్రియలు చేసే పురోహితులు
3. పాడె మోసే నలుగురు
4. ఉత్తర క్రియలకు కావాల్సిన వస్తువులు
5. శ్మశానాలతో టై అప్. కరెంట్, కట్టెలు, పూడ్చడం…మూడు అప్షన్లు ఉన్నాయి.
6. అస్తికల నిమజ్జనం
ఇందులో అప్షన్స్ ఎంచుకోవడాన్ని బట్టి 40 వేల నుండి లక్షల దాకా వివిధ ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఈ కంపెనీ అయిదు వేల అంత్యక్రియలు నిర్వహించింది.
భారత్ లో ఏటా రెండు వేల కోట్ల రూపాయల అంత్యక్రియల మార్కెట్ ఉన్నట్లు ఈ కంపెనీ ప్రాథమిక అంచనా. ఇంకా చాలా వివరాలున్నాయి కానీ చావు కబుర్లు ఇంతకంటే ఎక్కువయితే బాగోదు.
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అని కవి వాక్కు!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :