తాటాకు చప్పుళ్లకు భయపడబోమని.. తప్పు చేసిన వాళ్ళు భయపడతారని పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఐటీ దాడులపై మంత్రి తలసాని స్పందించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని, వాటిని ఎదుర్కొంటామన్నారు. ఈడి, ఐటీ దాడులకు భయపడేది లేదని,
ఈ దాడులను ముందే ఊహించామన్న మంత్రి తలసాని – సీఎం కేసీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు వ్యవస్థలు మీచేతుల్లో ఉండొచ్చు.. రేపు మా చేతుల్లో ఉండవచ్చన్న ఆయన.. లక్ష్యం చేసుకొని దాడులు చేయడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, దేశ చరిత్రలో ఇలాంటి విధానాలను ఎప్పుడూ చూడలేదన్నారు.
లక్ష్యంగా చేసుకున్న దాడులకు టీఆర్‌ఎస్ నాయకత్వం భయపడదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామని, ప్రజలను చైతన్యం చేసి ఏంటనేది వ్యవస్థలకు చూపిస్తామన్నారు. అంత భయపడితే హైదరాబాద్‌లో ఎందుకుంటామన్న మంత్రి.. ఏం జరుగుతుందో భవిష్యత్‌లో చూస్తారన్నారు. ఈ నెల 27న టీఆర్‌ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామని, 15 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read : మంత్రి మల్లారెడ్డిపై ఐటీ శాఖ మెరుపు దాడులు