Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆర్డర్! ఆర్డర్! హియర్ మీ!

ఆర్డర్! ఆర్డర్! హియర్ మీ!

“ప్రజాస్వామ్యమంత అరాచకమయినది మరొకటి లేదు; దానికి మించిన మెరుగయిన వ్యవస్థ ప్రపంచంలో మరొకటి లేదు” అని ఎవరన్నారో కానీ…ఇప్పుడు భారత సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చూస్తే ఈ “అరాచకం” విమర్శలో ఎంత లోతు ఉందో అర్థమవుతోంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడానికి స్వయం ప్రతిపత్తిగల ఎన్నికల సంఘం ఉంది. దానికి కొన్ని విధి విధానాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అయితే ఆ స్వయం ప్రతిపత్తి డిబేటబుల్. ఎన్నికల సంఘం నిష్పాక్షికత మీద సాపేక్షమయిన అభిప్రాయాలే వ్యక్తమవుతూ ఉంటాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నియామకం మీద సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ…చాలా తీవ్రమయిన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలన్నీ తుది తీర్పులో భాగమవుతాయో లేదో తెలియదు కానీ…విచారణ సందర్భంగా వాద ప్రతివాదనల్లో కామెంట్లు కూడా తీర్పులన్నట్లు మీడియాలో వస్తున్న రోజులు కాబట్టి…ముందు సుప్రీం కోర్టు అన్న మాటలేమిటో చూద్దాం.

1. ప్రధానిపైన అయినా చర్యలు తీసుకోగలిగే ఎన్నికల ప్రధానాధికారి ఉండాలి.
2. ప్రభుత్వాలు శాశ్వతంగా అధికారంలో ఉండడానికి తాము చెప్పినట్లు వినే కీలుబొమ్మలను ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తున్నాయి.
3. ఎన్నికల సంఘం రాజకీయ ప్రలోభాలకు దూరంగా స్వతంత్రంగా ఉండాలి.
4. నీతి నిజాయితీ ఉన్నవారినే ఆ పదవిలో నియమించాలి.
5. టి ఎన్ శేషన్ లాంటి అధికారులు మళ్లీ ఎన్నికల సంఘానికి ఎందుకు దొరకలేదు?
6. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిSupremన ఎన్నికల ప్రధానాధికారి అరుణ్ గోయల్ నియామక ప్రక్రియ ఫైళ్ళన్ని కోర్టుకు సమర్పించాలి.
7. ఎన్నికల సంఘం ప్రధానాధికారి నియామకంలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా భాగస్వామిని చేయాలి.

ఇవన్నీ ఆచరణ సాధ్యమే అయినా…రాజకీయ ఆచరణలో అసాధ్యం అని అందరికీ తెలుసు. పాఠం రెండు రకాలు.
ఒకటి- అకెడెమిక్.
రెండు- ప్రాక్టికల్.
అకెడెమిక్ గా సుప్రీం కోర్టు చెబుతున్నది సాధ్యమే. ప్రాక్టికల్ గా అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమయినా…
తనే కత్తి నూరి పదును పెట్టి…ఆ కత్తిని పువ్వుల్లో పెట్టి ఎన్నికల ప్రధానాధికారి చేతికిచ్చి…తన మెడ కోసి పుణ్యం కట్టుకోమని అడుగుతుందా?

ఎంత రాముడు నడిచిన నేల మీద మనమున్నా…
అప్పుడది త్రేతాయుగం.
ఇప్పుడిది కలియుగం.

రామరాజ్యం సంభవించే కాలమా ఇది?

“ఉన్నది మనకు ఓటు-
బతుకు తెరువుకే లోటు”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

న్యాయ- అన్యాయాల మీమాంస

Also Read :

మునుగోడులో మునిగేది ఎవరు?

RELATED ARTICLES

Most Popular

న్యూస్