ఛత్తీస్‌గఢ్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ రోజు ఉదయం 7.30 గంటల సమయంలో జరిగిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బీజాపూర్‌లోని మిర్తుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పమ్రా అటవీ ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్ జవాన్లు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, పోలీసుల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారని బీజాపూర్ ఎస్పీ ఆంజనేయ వర్శనే తెలిపారు. చనిపోయినవారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఘటనా స్థలంలో లభించిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
పిఎల్ జీఏ వారోత్సవాల కోసం సుమారు 40 మంది మావోయిస్టులు సమావేశం అయ్యారనే పక్క సమాచారం ఆధారంగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారని సమాచారం. ఎదురుకాల్పుల్లో ఎంతమంది గాయపడ్డారు…పోలీసుల వైపు జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని పోలీసులు వెల్లడించారు.