Amaravathi: అమరావతి రాజధాని అంశంలో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీరుపై పూర్తి స్థాయి స్టే ఇవ్వడానికి భారత సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ విషయంలో తన వైఖరి వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిఆర్డీయే పరిధిలో నెలరోజుల్లో కొన్ని అభివృద్ధి పనులు, ఆరు నెలల్లో మరి కొన్ని పనులు పూర్తి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాత్రం స్టే విధించింది. రాష్ట్ర రాజధానిని నిర్ణయించే హక్కు శాసనసభకు లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు ‘నో’ చెప్పింది.
విచారణ సందర్భంగా సుప్రీం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నిర్ధిష్ట కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని చెప్పడానికి హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అంటూ ప్రశ్నించింది. హైకోర్టు ప్రభుత్వమైతే… కేబినేట్ ఎందుకంటూ నిలదీసింది. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన సుప్రీం కోర్టు తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.