అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేకే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలి వెళుతున్నాయని, ఏపీకి చెందిన పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడి నుంచి తమ సంస్థలను వేరే చోటకు మార్చడం ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి నిదర్శమనమని టిడిపి సీనియర్ నేత ధూలిపాళ్ల నరేంద్ర విమర్శించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు సొంత గడ్డపై పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఎందరో ఔత్సాహికులు వచ్చి పెట్టుబడులు పెట్టారని వారు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారని చెప్పారు. మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏపీలో కప్పం కడితే తప్ప పరిశ్రమలు పెట్టలేని, నడపలేని పరిస్థితి ఉందని, గతంలో గుజరాత్ తో సమానంగా పారిశ్రామికాభివ్రుద్ధిలో పోటీ పడిన ఏపీ ఇప్పుడు దేశంలో అట్టడుగు స్థాయికి చేరుకుందని నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమర్ రాజా బ్యాటరీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ…. తెలంగాణా ప్రభుత్వం రోజూ సిఎం జగన్ ఫొటోకు దణ్ణం పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వ్యాపారస్తులను బెదిరించడమేనా ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి అంటూ ప్రశ్నించారు. కాకినాడ సీ పోర్ట్, ఎస్ ఈ జడ్ పోర్ట్ వాటాలు జగన్ బినామీ సంస్థ అరబిందోకు ఎలా వచ్చాయని నిలదీశారు.
జగన్, అయన బినామీ కంపెనీలు తప్ప ఇతర సంస్థలు ఏపీలో ఉండకూడదన్నట్లు జగన్ వ్యవహార తీరు ఉందని నరేంద్ర దుయ్యబట్టారు. ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 7 వేల కోట్ల రాయితీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.