Saturday, November 23, 2024
HomeTrending Newsగుజరాత్ లో కమల వికాసం.. హిమాచల్లో కాంగ్రెస్ గెలుపు

గుజరాత్ లో కమల వికాసం.. హిమాచల్లో కాంగ్రెస్ గెలుపు

గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ్ డంకా మోగించింది. మొత్తం 182 స్థానాలకు గాను బిజెపి 157 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 16 స్థానాలతో సరిపెట్టుకోగా అమ్ ఆద్మీ పార్టీ ఐదు స్థానాలు దక్కించుకుంది. మరో నాలుగు సీట్లలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. గుజరాత్ లో అధికారం చేపట్టాలంటే 92 స్థానాల్లో గెలవాలి. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ గుజరాత్‌ చీఫ్‌ సీఆర్‌ పాటిల్‌ వెల్లడించారు.

గుజరాత్‌ రాష్ట్రంలో గత 27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. 2002లో 127 సీట్లు గెలుచుకుని బీజేపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ముఖాముఖి పోరు జరిగినా.. అధికారం మాత్రం కమలం పార్టీదే. ఈసారి ఆప్‌ రంగంలోకి దిగడంతో త్రిముఖంగా మారింది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో మాత్రం బీజేపీ భారీ విజయం సాధిస్తుందని రాగా అదే జరిగింది. విపక్షాల ఓట్ల చీలిక బీజేపీకి కలిసి వచ్చింది. గుజరాత్‌లో బీజేపీ వరుసగా ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దేశంలో ఇంత కాలం నిరంతరాయంగా రాష్ట్రాన్ని పాలించిన ఏకైక పార్టీగా బిజెపి రికార్డు సృష్టించింది.

ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు సిద్దమైంది. రాష్ట్రంలో 68 స్థానాలు ఉండగా కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. మెజార్టీ మార్కుకు 34 స్థానాలు అవరం కాగా మరో ఆరు సీట్లు అదనంగా దక్కించుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందగా.. మూడు సీట్లలో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. అమ్ ఆద్మీ పార్టీ హిమాచల్ లో ఖాతా తెరవలేకపోయింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ప్రభావం హిమాచల్ మీద ఉంటుందన్న ఆప్ నేతల అంచనాలు తలకిందులయ్యాయి.

హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని ఓటర్లు కొనసాగించారు. 1985 నుంచి వరుసగా రెండుసార్లు ఏ పార్టీకి పట్టంకట్టని హిమాచల్‌ ప్రజలు ఈసారి ఆ ఆనవాయితీ కొనసాగించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగినంత మెజారిటీ వచ్చినా కాంగ్రెస్ లో భయం పట్టుకుంది. మధ్య ప్రదేశ్, గోవా అనుభవాల నేపథంలో ఎమ్మెల్యేలను క్యాంపుకు తరలించే యోచనలో ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్