Sunday, November 24, 2024
HomeTrending NewsBabu: సమస్యలు వదిలేసి బాధ్యతారహిత ప్రకటనలా?

Babu: సమస్యలు వదిలేసి బాధ్యతారహిత ప్రకటనలా?

రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించకుండా సమైక్య రాష్ట్రం అంశంపై బాధ్యతా రహితమైన ప్రకటనలు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  వైసీపీ నేతలపై విమర్శలు చేశారు. రైతుల ఆత్మ హత్యలపై నేడు ఓ దినపత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని షేర్ చేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ పై ఇటీవల సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాబు స్పందించారు.

“ఏపీలో అన్నదాతల ఆత్మహత్యలు పెరగడం ఆందోళనకరం.వ్యవసాయరంగ వృద్దిలో,ఆక్వా ఎగుమతుల్లో నాడు రికార్డులు సృష్టించిన రాష్ట్రం…ఇప్పుడు మూడేళ్లలో 1673 రైతు ఆత్మహత్యలతో సూసైడ్స్ స్టేట్ గా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు రైతులను అప్పులపాలు చేస్తున్నాయి. మద్దతు ధర లేకపోవడం, వ్యవసాయ సబ్సిడీలు నిలిచిపోవడం వంటివి అన్నదాతల బలవన్మరణాలకు  కారణం అవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ టెర్రరిజం తీరుతో ప్రజలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయి.  దీంతో నిస్పృహకు గురైన సామాన్యులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో ఇన్ని సమస్యలతో ప్రజలు నిరాశానిస్పృహలతో  ఉంటే… వైసీపీ ప్రభుత్వం వాటిపై దృష్టి పెట్టకుండా, తమ చేతుల్లో లేని సమైక్య రాష్ట్ర అంశంపై బాధ్యతా రాహిత్యంగా ప్రకటనలు చేస్తోంది. రెండు రాష్ట్రాలు కలవాలి, కలపాలి అంటూ ప్రజలను గందరగోళంలోకి నెడుతూ సమస్యలను పక్కదారి పట్టిస్తోంది. ఏపీ విభజన చట్టం ప్రకారం మనకు రావాల్సిన నిధులపై నోరెత్తని వైసీపీ..మళ్లీ సమైక్య ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం మోసపూరితం. చెప్పాలంటే రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్లనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది.ప్రభుత్వ పెద్దలు ముందు ఆ తప్పులను సరిదిద్దుకోవాలి.

ఇప్పటికైనా ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే సమైక్య రాష్ట్ర ప్రకటనలు ఆపి… రైతుల ఆత్మహత్యలు, ప్రజల సమస్యలకు కారణాలు విశ్లేషించాలి. సత్వర స్పందనతో ప్రణాళిక అమలుపరిచి అన్నదాతలకు అండగా నిలవాలి” అంటూ ప్రభుత్వానికి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్