Sunday, November 24, 2024
HomeTrending Newsగుణాత్మక మార్పు కోసం.. బీఆర్ఎస్ ఆవిర్భావం

గుణాత్మక మార్పు కోసం.. బీఆర్ఎస్ ఆవిర్భావం

దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడానికి, దేశంలో గుణాత్మక మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి, స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీగా మార్చాల్సిన అనివార్య చారిత్రక సందర్భంలో భారత రాజకీయ యవనికపై కేసీఆర్ మార్కు రాజకీయాలను చూడబోతున్నాం.

దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల 70 ఏండ్ల పాలన ఫలితంగా నేడు ప్రజలు కనీస వసతులలేమితో కటకటలాడుతున్నారు. ఈరోజుకూ దేశంలో విద్యుదీకరణకు నోచుకోని గ్రామాలెన్నో ఉన్నాయి. మంచినీరు, రహదారులు, విద్యుత్ లాంటి సౌకర్యాలు లేని గ్రామాలు, ఆవాస ప్రాంతాలు వేల సంఖ్యలో ఉన్నాయి. భారతదేశంతోపాటు, ఆ తర్వాత స్వతంత్రం పొందిన అనేక దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతుండగా, భారతదేశంలో ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, సామాజిక రుగ్మతలు కొనసాగుతున్నాయి.

దేశంలో 70 వేల టి.ఎం.సి.ల నీటి లభ్యత ఉంది. ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా భారతదేశంలో సాగుభూమి విస్తీర్ణం 41 కోట్ల ఎకరాలు మాత్రమే ఉంది. ప్రతి ఎకరానికి కావలసినంత నీరు ఉన్నప్పటికీ, కేంద్రం ప్రణాళికా లోపంతో సాగునీరందడం లేదు. సరిపడా జల సంపద ఉన్నా దేశ ప్రజలు మాత్రం తాగునీటి కోసం, సాగు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. దేశంలో నీటి యుద్ధాలు చెలరేగే పరిస్థితి ఉత్పన్నం కావడానికి కాంగ్రెస్, బిజెపిల అసమర్థ పరిపాలనే కారణం. దేశాన్నేలిన ఈ రెండు పార్టీలూ ఆఖరికి దేశంలో ఉత్తర, దక్షిణ వివాదాలు, విభేదాలు చోటు చేసుకునే స్థాయికి పరిస్థితిని దిగజార్చాయి. మరోవైపు మన దేశంతోపాటే ప్రయాణం ప్రారంభించిన చైనా.. అభివృద్ధి విషయంలో మనం మరో 50 ఏళ్లకు కూడా అందుకోలేనంత ఎత్తుకు చేరుకున్నది. ఎన్నో దేశాలు అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ మనం మాత్రం ఇంకా కుల, మత ఘర్షణలతో కాలం వెల్లదీస్తున్నాం.

విదేశీ సంస్థలన్నీ భారత్‌కే రావాలి.. మా దేశంలో వ్యాపారం అంటే ఇక్కడే తయారు చేయాలి.. చైనా ఉత్పత్తులను తగ్గించుకుందాం.. మేక్‌ ఇన్‌ ఇండియా, స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూపోతున్నది. మోదీ హయాంలోనే చైనాతో భారత్‌ వాణిజ్యం భారీగా పెరుగుతున్నది. ఇప్పటికీ చైనా దిగుమతులపైనే మనం ఆధారపడే దుస్థితి ఉంది. చెప్పుల నుంచి మొదలుకొని.. ఇనుము-ఉక్కు వస్తువులు, రాగి, న్యూక్లియర్‌ రియాక్టర్స్‌, జంతు కొవ్వులు-వెజిటబుల్‌ కొవ్వులు, మినరల్‌ ఇంధనాలు, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ మెషినరీ, పారిశ్రామిక రసాయనాలు, యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియెంట్స్‌, ఆటో కంపోనెంట్స్‌ దాకా మనం చైనాపై ఆధారపడే దుస్థితి.

2021లో భారత్‌-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం రూ.10,42,480 కోట్లు (125 బిలియన్‌ డాలర్లు) ఉన్న విషయాన్ని అర్ధం చేసుకోవాల్సి ఉంది. గత ఐదేండ్లలో చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 30 శాతం పెరిగినట్టు పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానాలు, అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరే దీనికి కారణమంటూ ఆర్థిక నిపుణులు అంటున్నారు. విదేశాలపై ఆధారపడే దుస్థితి మారాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ గారు భావిస్తున్నారు.

40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండి, 70 వేల టీఎంసీల నీటి వనరులుండి, రైతుల ధర్నాలు ఇంకెంత కాలం? ఆకలి ఇండెక్సులో మనం ఎందుకు ముందు వరుసలో ఉన్నాం? ఎన్నో ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలో పరిస్థితి ఎందుకు మారడం లేదు? ’’ అని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎంతగానో ఆవేదన చెందుతున్నారు. సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురై వెనుకబడిన తెలంగాణ ప్రాంతాన్నే, కేవలం 8 ఏండ్ల స్వల్పకాలంలోనే ఎంతో గొప్పగా మనం అభివృద్ధి చేసుకొని, దేశానికే మోడల్ గా నిలుస్తున్నపుడు.. రత్నగర్భ అయిన భారతదేశాన్ని ఇంకెంతో గొప్పగా అభివృద్ధి చేసుకోగలం.. అని కేసీఆర్ గారు భావిస్తున్నారు.

ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముంది. వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం (New Agriculture Policy) అవసరమున్నది.
అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలను, కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక వంటి సహచర రాష్ట్రాలు చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నది. ట్రిబ్యునల్స్ పేరుతో వీటిని కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి బాగు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం ఈ దేశానికి నూతన జలవనరుల పాలసీ (New Water Policy) కావాలి.
ఈ దేశంలో లక్షలాది మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే ప్రకృతి వనరులున్నయి. అయినా పల్లె పల్లెకూ విద్యుత్ అందించుకోలేక పోవడాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అందుకు నూతన విద్యుత్ పాలసీ (New Power Policy) కావాలి.

దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలను అనేకరకాలుగా వివక్షకు గురిచేస్తూ, దేశ అభివృద్ధిని కుంటుపడేలా చేస్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సి ఉన్నది. దేశ ప్రగతిలో మహిళలను మరింత భాగస్వాములను చేసే దిశగా మహిళా సాధికారత విధానం (women empowerment policy) తేవాల్సి ఉంది. అంతే కాకుండా, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధి పరచడానికి ప్రగతికాముక విధానాలను రూపొందించాల్సి ఉంది.. అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

‘‘ఈ దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు రావాలి. సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లాలి. దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగాలి. రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండానే వాటి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయాలను కేంద్రం ఏకపక్షంగా తీసుకుని రుద్దడం వల్ల ఆయా రాష్ట్రాల్లో పరిపాలనా పరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి విఘాతం కలుగుతున్నది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి తదితర అంశాలలో కేంద్రానికి మితిమీరిన ఆజమాయిషీ ఎందుకుండాలి? అని మనం వేస్తున్న ప్రశ్నల మీదే ఇవాళ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఆయా రాష్ట్రాల భౌగోళిక భిన్నత్వం, సాంస్కృతిక ప్రత్యేకతలు, స్థానిక అవసరాలు, సామాజిక కూర్పు ఆధారంగా రాష్ట్రాలు తీసుకోవాల్సిన నిర్ణయాలను, రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రమే తీసుకోవడం వల్ల రాష్ట్రాల నిర్దిష్ట అవసరాలకు, ప్రయోజనాలకు కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మధ్య పొంతన లేకుండా పోతోంది. దీంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. దేశ విశాల ప్రయోజనాల కోసం కాకుండా కేంద్ర ప్రభుత్వాలు తమ చిల్లర మల్లర ప్రయోజనాలకోసం తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆయా రాష్ట్రాల అభివృద్ధికి గొడ్డలి పెట్టుగా మారుతున్నాయి అందుకే ఈ దేశ రాజకీయ ప్రక్రియలో ఒక గుణాత్మక మార్పు అనివార్యం.’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భావించారు.

జాతీయ రాజకీయాల్లోకి రావాలనే సీఎం కేసీఆర్ ఆలోచన ఈనాటిది కాదు. నాలుగున్నరేళ్ల క్రితమే 2018 మార్చి 3న హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరాన్ని చెప్పారు. అవసరమైతే తానే ఈ మార్పు కోసం ప్రయత్నిస్తానని, జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తానని ఆనాడే ప్రకటించారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి, దేశవ్యాప్తంగా మద్దతు కూడగడతానని ప్రకటించారు. ప్రజలను ఏకం చేస్తానని చెప్పారు. తదనుగుణంగానే 2022 అక్టోబర్ 5న సీఎం కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీని ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని డిసైడ్ అయిన కేసీఆర్.. రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేయడానికి దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం ఇప్పటికే ఓ ప్రైవేట్ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఎస్పీ రోడ్డులో ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ కార్యాలయాన్ని రేపు కేసిఆర్ ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ పార్టీ జాతీయ విధానాన్ని సైతం అక్కడే ప్రకటిస్తారు. దాంతో పాటు జాతీయ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ ప్రారంభోత్సవానికి వివిధ రాష్ట్రాలకు చెందిన నాయకులను ఆహ్వానించారు.

ఈనెల 14న బుధవారం ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తున్నారు. అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బీఆర్ఎస్ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ వీధుల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు వెలిశాయి. ‘‘కేసీఆర్‌ ఫర్‌ ఇండియా, దేశ్‌ కా నేత కేసీఆర్.. దేశ్ కిసాన్‌ కీ భరోసా కేసీఆర్, అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’’ అనే నినాదాలతో ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

బుధవారం ఢిల్లీ సర్దార్ పటేల్ మార్గ్ లోని రోడ్ నంబర్ 5లో ప్రారంభించ బోతున్న BRS పార్టీ ఆఫీస్ లో.. విజయ సంకల్ప దిశగా యజ్ఞ క్రతువు ను నిర్వహించి సమర శంఖం పూరించనున్నారు.

రేపటి BRS విజయానికి భరోసాగా, సంకల్పానికి దన్నుగా, అక్కడే నిలిచిన జమ్మి చెట్టు సీఎం కేసిఆర్ ఆశయాలకు ఊతంగా నిలిచింది. జమ్మి కింది పూజ జయము జయము అంటూ సకల జనులు ప్రగాఢంగా విశ్వసిస్తున్న, భారత రాజకీయ యవనికపై వో ఉజ్వల చారిత్రక ఘట్టం..రేపు ఆవిష్కృతం కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్