సంక్రాంతి తరువాత తన పాదయాత్రను కొనసాగిస్తానని వైఎస్సార్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. మన అదృష్టం కొద్దీ న్యాయవవస్థ అండగా ఉంటోందని, పాదయాత్రపై హైకోర్టు నిన్న ఇచ్చిన ఆదేశాలను ఈ ప్రభుత్వం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పాదయాత్ర చివరి విడత మాత్రమే మిగిలి ఉందని, సంక్రాంతి తరువాత యాత్రను ఎక్కడ ఆపామో అక్కడి నుంచే కొనసాగిస్తామని ప్రకటించారు. ఇటీవలి ఆమరణ దీక్ష సందర్భంగా తన ఆరోగ్యం దెబ్బతిందని, మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించినందున యాత్ర వాయిదా వేస్తున్నామని తెలిపారు.
పోలీసులు తనను గృహ నిర్బంధం చేయడం దారుణమని షర్మిల వ్యాఖ్యానించారు. పోలీసు శాఖపై కేసు నమోదు చేయబోతున్నట్లు ప్రకటించారు. పోలీస్ శాఖ మొత్తం కేసిఆర్ కనుసన్నల్లోనే నడుస్తోందని, తాము ఏ పనీ చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదని, అనేక ఆంక్షలు పెట్టి తమను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. ఏ అధికారం ఉందని తమను అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండానే ఇన్ని అంక్షలు పెట్టడం సరికాదన్నారు. తన హక్కులను పోలీసులు కాలరాస్తున్నారని ఆక్షేపించారు.
ఇక్కడ తమ యాత్రను అడ్డుకున్నారని, తమను ఇబ్బంది పెడుతున్నారని… అలాగే ఢిల్లీలో బిఆర్ఎస్ ఫ్లెక్సీలు పోలీసులు తొలగించారని అన్నారు. ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంపై షర్మిల ఎద్దేవా చేశారు. కేసిఆర్ పాలనలో రైతులు ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారని, వారికి రుణమాఫీ పూర్తి చేయలేదని, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు ఇవ్వడం లేదని; రుణాలు సరిగా అందడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్ళలో 8వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కిసాన్ సర్కార్ అంటున్నారని ఎదురు ప్రశ్నించారు.
Also Read : షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి