Sunday, November 24, 2024
HomeTrending Newsగొడవలతోనే గెలవాలనే వ్యూహం ఫలించదు:  విజయసాయి

గొడవలతోనే గెలవాలనే వ్యూహం ఫలించదు:  విజయసాయి

కుప్పం, ఇటీవలి మాచర్లలో జరిగిన సంఘటనలతోనే ఎన్నికల్లో  గెలవాలన్న చంద్రబాబు వ్యూహం ఫలించాడని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేయించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని బాబు అనుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై సోషల్  మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు విజయసాయి.

“ఆగస్టు చివరి వారంలో కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు రెండు ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. కాని, మాజీ ముఖ్యమంత్రి మీద ద్వేషంతో పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులే టీడీపీ నేతలు, సభ్యులపై దాడులు చేయించారని ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్‌ వారం పది రోజులపాటు ఆరోపణల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా ముఖ్యమంత్రిపై ఈ పార్టీ నాయకులు నిప్పులు కక్కారు. పాలకపక్ష నాయకుడి ప్రోద్బలంతోనే కుప్పంలో ‘విధ్వంసకాండ’ జరిగిందని టీడీపీ, దాని అనుకూల పత్రికలు కోడైకూశాయి. మూడున్నరేళ్లుగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రోజురోజుకూ జనాదరణ పెంచుకుంటున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార ఆరోపణలు చేయడానికి, దుష్ప్రచారం చేయడానికి కుప్పం గొడవలను తెలుగుదేశం, చంద్రబాబు తెగ వాడుకునే ప్రయత్నం చేసిన విషయం జనం ఇంకా మర్చిపోలేదు.”

“కోతికి కొబ్బరికాయ దొరికినట్టు తెలుగుదేశం నాయకులకు ఇప్పుడు పల్నాడు జిల్లా మాచర్ల ‘హింసాకాండ లేదా విధ్వంసకాండ’ అనే అంశం దొరికింది. మాచర్ల టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో తలపెట్టిన పార్టీ కార్యక్రమాల సందర్భంగా ‘చెలరేగిన ఘర్షణలు’ పాలకపక్షం జోక్యంతో జరిగాయని మొదట ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు పోలీసు వ్యవస్థపై నిందలేస్తున్నారు. రాష్ట్ర, జిల్లా పోలీసు ఉన్నతాధికారులే ఈ గొడవలకు వ్యూహాలు పన్ని అమలు చేశారని డీజీపీకి రాసిన లేఖలో ఈ మాజీ ముఖ్యమంత్రి ఆరోపించడం సిగ్గుచేటు. తాను ముఖ్యమంత్రిగా దాదాపు 14 ఏళ్లు పనిచేసిన రోజుల్లో జరిగిన రాజకీయ హింస, విధ్యంసకాండలకు అప్పటి పోలీసు అధికారులే కారణమా? నారా వారి లేఖలోని ఆరోపణలు చూస్తే…ఈ మహానుభావుడు నిజంగా ఉమ్మడి రాష్ట్రానికి, విభజిత ఏపీకి ముఖ్యమంత్రిగా అన్నేళ్లు పనిచేశారా? అనే అనుమానం వస్తుంది.”

“1995–2004, 2014–2019 మధ్యకాలంలో తెలుగుదేశం అధికారంలో ఉండగా జరిగిన రాజకీయ హింస అంతా నాటి పోలీసు ఇంటెలిజెన్స్‌ అధికారాలు ప్లానింగ్‌ తోనే జరిగిందా? అని కూడా అనుకోవాల్సివస్తోంది. కుప్పం, మాచర్ల… ఇలా మూడు నాలుగు నెలల వ్యవధితో జరిగే గొడవలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా సాగదీయడం వల్ల టీడీపీకి ఏమీ ప్రయోజనం ఉండదు. ఎన్నికలు జరగడానికి ఏడాది ముందు నుంచే రాజకీయ వాతావరణం వేడెక్కించే చర్యలకు టీడీపీ నేతలు పాల్పడితే మాజీ సీఎం చంద్రబాబు గారికే నష్టం. ఘర్షణపూరిత రాజకీయ వైఖరి అవలంబిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఎంతటి పెద్ద నాయకుడినైనా మెచ్చరని ఆయన గుర్తించాలి. నిత్యం రాష్ట్రంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరియాలని జనం కోరుకుంటారు. తాను జిల్లాల్లో పర్యటించిన ప్రతిసారీ ప్రభుత్వ అధికారులను, పోలీసు సిబ్బందినీ నిరంతరం బెదిరిస్తూ, రెచ్చగొట్టే విధంగా మాజీ సీఎం గారు మాట్లాడితే ఆయన పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతారు. అంతేకాదు, పోలీసుల మనోస్థయిర్యం దెబ్బదింటుంది. రాజకీయ పరిణామాలకు, పోలీసులకు లంకె పెడితే ఎలాంటి ‘ఎన్నికల ప్రయోజనం’ సిద్ధించదని ఈ ‘సీనియర్‌ మోస్ట్‌ రాజకీయవేత్త’కు ఎవరు చెప్పాలి?” అంటూ ప్రశ్నించారు.

Also Read :  మాచర్లలో పరిస్థితి అదుపులో ఉంది : జిలా ఎస్పీ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్