డ్రగ్ పరీక్ష కోసం తన రక్తం.. కిడ్నీ కూడా ఇస్తానన్న మంత్రి కేటిఆర్ ఇక్కడే ఉంటా డాక్టర్స్ ను తీసుకురా అని బిజెపి ఎంపి బండి సంజయ్ కుమార్ కు సవాల్ చేశారు. క్లీన్ చిట్ తో బయటికి వస్తానని…కరీంనగర్ చౌరస్తాలో బండి సంజయ్ తన చెప్పుతో తానే కొట్టుకుంటారా అని ప్రశ్నించారు. వేములవాడ నియోజకవర్గం రుద్రంగిలో ఈ రోజు కస్తుర్బా బాలికల పాటశాల నూతన భవనం ప్రారంభించారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్‌ను తిడితే ఓట్లు రాలవు.. దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురా అని బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మా కంటే రెండు మంచి పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకోండి. పొద్దున లేస్తే బూతులు మాట్లాడటం తప్పా ఆయనకు ఏం తెల్వదు. వీళ్లు వచ్చిన తర్వాతే దేవుడికి మొక్కుడు నేర్పించినట్లు వ్యవహరిస్తున్నారు. బండి సంజయ్ నిజంగా రాజన్న భక్తుడు అయితే వేములవాడకు రూ. 100 కోట్లు ఎందుకు తేలేకపోతున్నాడు. మోదీ దగ్గర పలుకుబడి లేదా. అడగడానికి నోరు రాదా. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామికి, కొండగట్టు అంజన్న ఆలయానికి, జోగులాంబ ఆలయానికి, భద్రాద్రి రాముడికి, యాదాద్రికి నిధులు తీసుకురా అని సంజయ్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు.
మన ప్రభుత్వం వచ్చాక అమలు చేసిన అభివృద్ధి గురించి చెప్పే శక్తి మన కేడర్‌కు ఉంది. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు. మన సెస్ పరిధిలో 2014 వరకు 44 సబ్ స్టేషన్లు ఉండేవి.. 8 సంవత్సరాల పరిపాలనలో మనం రూ. 51 కోట్లతో 34 కొత్త సబ్ స్టేషన్లను నిర్మించాం. కొత్తగా ఐదు మంజూరు చేసుకున్నామని తెలిపారు. 65 ఏండ్లలో చేసిన అభివృద్ధి మనం 8 ఏండ్లలో చేసి చూపించామన్నారు. మూలవాగుపై రూ. 62 కోట్లతో 13 చెక్ డ్యాంలు నిర్మించామని తెలిపారు.
రాజన్న గుడిని అభివృద్ధి చేస్తాం.. అది మా బాధ్యత అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఉత్తర కాశీకి నిధులు ఇచ్చారు. మరి దక్షిణ కాశీ అయిన వేములవాడకు ఎందుకు నిధులు ఇవ్వరు అని ప్రశ్నించారు. బీజేపీకి అబద్ధాలు చెప్పడం మాత్రమే తెలుసన్నారు. పల్లె పల్లెనా ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు ఉన్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇవన్నీ ఉన్నాయా? అని అడిగారు. దేశంలో ఉత్తమ 20 గ్రామపంచాయతీల్లో..19 గ్రామపంచాయతీలు మన రాష్ట్రంలో ఉన్నాయని వాళ్లే అవార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. వేములవాడను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం. వేములవాడను కూడా సిరిసిల్ల స్థాయిలో అభివృద్ధి చేస్తా.. తనకు ఈ రెండు ఒక్కటే అని కేటీఆర్ స్పష్టం చేశారు.