Saturday, November 23, 2024
HomeTrending Newsమెడికల్ హబ్ గా మహబూబ్ నగర్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్

మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఒకప్పుడు వైద్యం కోసం హైదరాబాద్ వెళుతుంటే మార్గమధ్యలో అప్పన్నపల్లి రైల్వే గేట్ పడటం కారణంగా సకాలంలో చికిత్స అందక అనేకమంది ప్రాణాలు కోల్పోయారని… తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా తీర్చిదిద్దామని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ పాత కలెక్టరేట్ ఆవరణలో రూ.300 కోట్లతో 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు… ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అంటే పేదరికానికి వలసలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేదని, తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి ఖిల్లాగా మారిందని తెలిపారు. వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడిన దశ నుంచి నేడు మెడికల్ టూరిజం ఏర్పాటు ద్వారా వైద్యం కోసం విదేశాల నుంచి తరలి వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కళాశాల మంజూరు చేయకపోయినా… రాష్ట్రంలోని మొట్టమొదటి మెడికల్ కళాశాలను మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉమ్మడి జిల్లాలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల లేని దశ నుంచి నేడు మూడు కళాశాలలు ఏర్పడ్డాయని, త్వరలో మరో రెండు కళాశాలలు కూడా ఏర్పాటు కానున్నాయన్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 1000 పడకల సూపర్ స్పెషాలిటీ నూతన హాస్పిటల్ వల్ల అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి రోగులు కూతవేటు దూరంలో హాస్పిటల్ చేరుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రూ. 300 కోట్లతో ప్రారంభమైన ఈ హాస్పిటల్ భవిష్యత్తులో రూ. 500 కోట్లకు పైగా ఖర్చుపెట్టి అత్యధిక సదుపాయాలన్నీ కల్పిస్తామన్నారు.

ఒకప్పుడు వలసల జిల్లాగా ఉంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలసలు వస్తున్నారని తెలిపారు. మహబూబ్ నగర్ లో విమానాశ్రయం మినహా అన్నింటినీ సాధించామన్నారు. ఏదో ఒక రోజు కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతారని… అప్పుడు విమానాశ్రయం సాధించడం ఏమాత్రం కష్టం కాబోదన్నారు.

స్థానికంగా ఉన్న ఒక్కగానొక్క కాటన్ మిల్లు మూతపడినా… దేశంలోనే అతిపెద్ద బ్యాటరీ పరిశ్రమ అమర రాజా లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమను ఇక్కడకు తీసుకువచ్చామన్నారు. దీంతో పాటు హన్వాడ ఫుడ్ పార్క్ , ఐటీ పార్క్ వల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయన్నారు. భారత్ మాలను అడ్డుకున్నా… చించోలి బైపాస్ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు కెసిఆర్ కృషి చేయడం వల్లే ఈమధ్యనే మహబూబ్ నగర్ కు రైల్వే డబుల్ లైన్ పూర్తయిందన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం ఒక గంటలో చేరుకునే సదుపాయం ఉన్న మహబూబ్ నగర్ కు భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందన్నారు.

మంత్రి హరీశ్ రావు కామెంట్స్… .

తెలంగాణ వచ్చాక మొట్టమొదటి మెడికల్ కాలేజీ పాలమూరుకే వచ్చింది. నర్సింగ్ కాలేజీకి ప్రారంభించుకున్నం. పర్మినెంట్ బిల్డింగ్ కోసం 50 కోట్లతో శంకుస్థాపన చేసుకుందాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరిక మేరకు పారా మెడికల్ కోర్సు కూడా ఈ ఏడాది ప్రారంభించుకుంటాం. ఇక్కడి నుండి జాతీయ స్థాయి నాయకులు ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. ఒకే జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు. దేశంలోనే ఇలా ఒక జిల్లాలో ఇన్ని లేవు. సీఎం కేసీఆర్ గారి వల్ల సాధ్యం అయ్యింది. 26 పీజీ సీట్లు వచ్చి పీజీ కాలేజీ కూడా వచ్చింది. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఉంటే, 8 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీలు ప్రారంబించారు సీఎం. 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఇచ్చాము. త్వరలో భర్తీ చేస్తాం.

ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మా రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కే దామోదర్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, ఇంతియాజ్, డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మాజీ శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, వైద్య విద్య సంచాలకులు రమేష్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్