Wednesday, November 27, 2024
HomeTrending Newsరైతులపై వాలంటీర్ల పెత్తనం: బాబు

రైతులపై వాలంటీర్ల పెత్తనం: బాబు

ఎవరు అడిగారని రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, రైతులపై వాలంటీర్ల పెత్తనం ఏమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. గతంలోనే తాము సింగిల్ విండో విధానం ద్వారా రైతులను ఆదుకున్నామని గుర్తు చేశారు. బొబ్బిలిలో ఇదేం ఖర్మ మన రైతులకు కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు.  ఈ సందర్భంగా పలువురు రైతులు బాబుతో ముఖా ముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను బాబుకు వివరించారు. బాబు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు 1550 కోట్ల రూపాయలు ఖర్చుచేశామని, ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో తోటపల్లి, మద్దివలస ప్రాజెక్టులు తానే పూర్తి చేశానన్నారు.  గత ఐదేళ్ళ తమ పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగానికి స్వర్ణ యుగంలా గడిచిందన్నారు.  రైతు బజార్లు తాను ఏర్పాటు చేస్తే వాటిని ఇప్పుడు తాకట్టు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ను కూడా తానే ప్రవేశ పెట్టానన్నారు. జిల్లాలో చెరకు రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బ్యాగులకు కూడా 50 రూపాయలు వసూలు చేస్తున్నారని, తేమ పేరుతో ఒక్కో బస్తాకు 10 నుంచి 15 కిలోలు నొక్కేస్తున్నారని విమర్శించారు. ఈ సిఎం బటన్ నొక్కుడు తర్వాత బొక్కుడు చేస్తున్నారని మండిపడ్డారు.

సిఎం జగన్ కు వ్యవసాయం అంటే ఏమిటో కూడా తెలియదన్నారు. తాను గానీ, ఎన్టీఆర్ గానీ రాజకీయాల్లోకి రాకముందు కొన్నాళ్ళు వ్యవసాయం కూడా చేశామని వెల్లడించారు. భూమి శిస్తు రద్దు, 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ అందించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ ఫోటో ఎందుకని ప్రశ్నించారు.  తమకు అత్యంత ప్రాధాన్య అంశం వ్యవసాయం అని, అధికారంలోకి వచ్చిన తరువాత రైతాంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీఇచ్చారు. రైతులు గ్రామాల్లో చైతన్యం తీసుకు వచ్చి రాష్ట్రాన్ని, తద్వారా రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న బొబ్బిలి దద్దరిల్లిపోయిందని, ఎమ్మిగనూరు తో మొదలైన తన పర్యటన  ఇక్కడకు వచ్చేనాటికి ఉధృతంగా సాగిందని, ప్రజలకు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహం వ్యక్తమైందని బాబు అన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, కే. కళా వెంకట్రావు, బేబి నాయన తదితరులు పాల్గొన్నారు.

Also Read : వైసీపీ ఓటమి ఖాయం : బాబు ధీమా

RELATED ARTICLES

Most Popular

న్యూస్