Book of Morals: పెద్ద బాలశిక్షది పెద్ద చరిత్ర. నిజానికి దాని మొదటి పేరు బాలశిక్ష. తరువాత్తరువాత చాలా విషయాలతో విస్తరించే సరికి పెద్ద బాలశిక్ష అయ్యింది. ఇక్కడి విద్యా విధానానికి వీలుగా బ్రిటిషువారే బాలశిక్షను రాయించారు. మిగతా భాషల్లో పెద్ద బాలశిక్ష ఉండవచ్చు. ఉండకపోవచ్చు. తెలుగు పెద్ద బాలశిక్ష ఇదివరకు తప్పనిసరిగా ఇంట్లో ఉండాల్సిన పుస్తకం.
1832 లో మేస్తర్ క్లూ లో అనే ఆంగ్లేయ ఉన్నతాధికారి ప్రోద్బలంతో బాల శిక్ష పురుడుపోసుకుంది. పుదూరు చదలవాడ సీతారామశాస్త్రి బాలశిక్షను మొదట రాసినట్లు ఆరుద్ర అన్నారు. అయితే పుదూరు సీతారామ శాస్త్రి, చదలవాడ సీతారామ శాస్త్రి వేరు వేరు అని... బాలశిక్ష రాసినవారు పుదూరు సీతారామ శాస్త్రి అని తరువాత తేలింది. అంటే పెద్ద బాలశిక్షకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది.
ఇప్పటిలా ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కో సబ్జెక్ట్ కు ఒక్కో పుస్తకం, ఒకటి నుండి అయిదు వరకు విడి విడిగా తరగతులు లేని వీధి బడుల రోజుల్లో అక్షరాలు మెదలు ప్రాపంచిక విషయాల జనరల్ నాలెడ్జ్ దాకా అన్ని విషయాలు బోధించడానికి తయారయినది పెద్ద బాలశిక్ష. బాల- పిల్లల; శిక్ష- చదువు కలిపి బాలశిక్ష. 800 నుండి వెయ్యి పేజీల పెద్దది అయ్యింది కాబట్టి చివరికి పెద్ద బాలశిక్ష.
ఇంగ్లీషు మీడియం చదువులు రావడానికంటే ముందే దాదాపు 1950, 60 ల నాటికే పెద్ద బాలశిక్ష అవసరం తగ్గుతూ వచ్చింది. ఇంగ్లీషు మీడియం చదువులు పెరిగాక పెద్ద బాలశిక్ష పేరే వినని తరాలు పుడుతున్నాయి. ఒకప్పుడు మొత్తం పెద్ద బాలశిక్షను నోటికి నేర్చుకున్న తరాలు ఉండేవి.
పెద్ద బాలశిక్ష అవసరం ఇప్పుడుందా? లేదా? అనేది మరొక చర్చ. నిత్యవ్యవహారానికి సంబంధించిన కొలమానాలు, లెక్కలు, ప్రమాణాలు, నదులు, కొండలు, సముద్రాలు, రాశులు, నక్షత్రాలు, లోహాలు…అది ఇది అని లేకుండా అన్నీ ఉంటాయి పెద్ద బాలశిక్షలో.
ఇప్పుడదే పెద్ద బాలశిక్షను మళ్లీ పాఠంగా పెడితే పిల్లలకు నిజంగా పెద్ద శిక్ష అవుతుంది.
అన్నట్లు-
హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో పెద్ద బాలశిక్ష పుస్తకాలు గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా అమ్ముడవుతున్నట్లు ఒక వార్త. మంచిదే.
రెండొందల ఏళ్ల కిందట బడి పిల్లలకు తయారు చేసిన పెద్ద బాలశిక్ష…ఇప్పుడు పెద్దలు కష్టపడి చదువుకోదగ్గ విజ్ఞాన సర్వస్వ ఎన్ సైక్లోపీడియా మహద్గ్రంథం అయ్యిందన్నమాట.
అంటే మన విద్యా ప్రమాణాలు పెరిగినట్లా?
పడిపోయినట్లా?
నీకయినా తెలుసా?
ఓ పెద్ద బాలశిక్షా!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :
Also Read :