చంద్రబాబు విచిత్ర ధోరణి, విపరీత ప్రవర్తన, ప్రచార యావ వల్లే నిన్నటి కందుకూరు ఘటన జరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. అధికార దాహం కోసం 8 మంది ప్రజల ప్రాణాలు బలిగొన్నారని, ఆ మృతుల కుటుంబాల ఘోష బాబుకు తప్పకుండా తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. ఇరుకు రోడ్లలో మీటింగ్ పెట్టి ఎక్కుమంది జనం వచ్చారని ప్రచారం చేసుకుంటున్నారని, డ్రోన్ లతో కవర్ చేసి లేనిది ఉన్నట్లు చూపించాలని ప్రయత్నించారన్నారు. 10లక్ష రూపాయల పరిహారం ఇస్తే పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా అని కాకాణి ప్రశ్నించారు. పైగా బాబు ఏదో ఘనకార్యం చేశానని చెప్పుకోవడం, ఆయనకు వంత పాడే మీడియా దీని హైలైట్ చేయడం దారుణమన్నారు. ప్రజల ప్రాణాలకు వెలకడతారా అని నిలదీశారు. ఘటన పట్ల సిగ్గు పడాల్సింది పోయి, తానేదో ఘనకార్యం చేసినట్లు , ఉదారంగా వ్యవహరించినట్లు మట్లాడడం తగదన్నారు. ఎన్ని రకాల పొరపాట్లు చేయాలో అన్ని చేసి అమాయకులైన కూలీల ప్రాణాలు పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బాబు సభలకు పోలీసులు భద్రత కల్పిస్తుంటే మీకేం సంబంధం, మీరెవరు రావడానికి అంటూ దుర్భాషలాడారని, వారిని తూలనాడారని ఇప్పుడేమో పోలీసులు లేరని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏం వెలగబెట్టారని ప్రజలు తండోప తండాలుగా వస్తారని, చంద్రబాబే ఈ రాష్ట్రానికి ఖర్మ అని, బాబు మీటింగ్ కు రావడం ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఘటన జరిగిన వెంటనే యంత్రాంగం రంగంలోకి దిగిందని, పక్కనే ఆస్పత్రి ఉండడం అదృష్టమని లేకపోయి ఉంటే మరికొందరు చనిపోయి ఉండేవారని అన్నారు. కందుకూరు ఘటన ముమ్మాటికీ పాపం చంద్రబాబుదేనని, ఇవి ఆయన చేసిన హత్యలే అని అందుకే దీనిపై కేసు నమోదు చేసి బాబును నిందితుడిగా చేర్చాలని మంత్రి డిమాండ్ చేశారు. గతంలో పుష్కర స్నానం సమయంలోనూ ఇలాగే 29మంది ప్రజల ప్రాణాలు బలిగొన్నారని, అప్పుడు కూడా పబ్లిసిటీ కోసమే ఇలా చేశారని చెప్పారు.