తెలంగాణ కొత్త డీజీపీ గా అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏసిబి నుంచి డిజిపి (కోర్డినేషన్) బదిలీ చేస్తూ డిజిపిగా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఎం మహేందర్ రెడ్డి ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. 1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి అంజని కుమార్. గతంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా పని చేసిన అనుభవం ఉంది. లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా ఏసిబి చీఫ్ గా వివిధ హోదాల్లో సేవలు అందించారు.
అంజనీకుమార్ ఇప్పటివరకు నిర్వహించిన ఏసిబి చీఫ్ బాధ్యతలను మరో సీనియర్ అధికారి రవి గుప్తకు ఇచ్చారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి గా ఉన్న రవిగుప్త స్థానంలో అదనపు డిజి జితేందర్ కు పోస్టింగ్ ఇచ్చారు. జితందర్ స్థానంలో మరో అదనపు డిజి సంజయ్ కుమార్ జైన్ ను బదిలీ చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు డిజిగా పదోన్నతి ఇస్తూ ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న సిఐడి చీఫ్ బాద్యతలు అప్పగించారు. హైదరాబాద్ శాంతి భద్రతల అదనపు కమిషనర్ గా ఉన్న దేవందర్ సింగ్ చౌహాన్ ని రాచకొండ సిపిగా నియమించారు.