రాజకీయాల్లోకి వచ్చి 14 ఏళ్ళు అయినా కనీసం ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని, ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. “ఈయనకు నిర్మాత, డైరెక్టర్ బాబు అని… ఎప్పుడు షూటింగ్ అంటే అప్పుడు కాల్షీట్ ఇస్తాడని, ఎక్కడ షూటింగ్ అంటే అక్కడకు వస్తాడు, బాబు స్క్రిప్ట్ ఇస్తాడు, బాబుకు అనుకూలంగా యాక్ట్ చేసి చూపిస్తాడు.. ఇది ఈయన స్టైల్” అంటూ దుయ్యబట్టారు. నర్సీపట్నంలో జరిగిన సభలో చంద్రబాబు, పవన్ లపై విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 సంవత్సరాలు అయ్యిందని, రాష్ట్రంలో ఏ మంచి జరిగినా తానే చేశానని, తన వల్లే జరిగిందని అంటారని ఎద్దేవా చేశారు. సింధు బ్యాడ్మింటన్ లో గెలిస్తే సింధుకు ఆడడం తానే నేర్పానంటాడని, ఇది ఈనన స్టైల్ అంటూ వ్యంగ్యాస్త్రం విసిరారు. ‘కానీ ఈయన సొంత నియోజకవర్గం కుప్పంలో నీళ్ళు ఉండవు, రెవెన్యూ డివిజన్ కూడా మన హయంలోనే ఇచ్చాం. ఈయన పేరు చెబితే ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ కూడా గుర్తుకు రాదు అంటూ జగన్ విమర్శలు చేశారు. ఈయన్ను చూస్తె గుర్తు వచ్చేది ఒకటి వెన్నుపోటు, రెండోది మోసం అని దుయ్యబట్టారు. తన పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేసి, వంచించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.
బాబు అనే ఈ దత్తతండ్రిని నెత్తిన పెట్టుకొని దత్తపుత్రుడు వూరేగుతున్నాడని దుయ్యబట్టారు. ఈ రాష్ట్ర కాకపొతే ఆ రాష్ట్రం, ఈ ప్రజలు కాకపొతే ఆ ప్రజలు, ఈ పార్టీతో కాకపొతే ఆ పాతీతో.. ఈ భార్య కాకపొతే ఆ భార్యతో… అనేది వీరి స్టైల్ అని దుయ్యబట్టారు.
‘ఫలానా వాడు మన నాయకుడు అని ప్రతి కార్యకర్తా గర్వంగా చెప్పుకోనేలా, కాలర్ ఎగరేసుకొని తిరిగేలా జగన్ ఉంటాడని, ఇచ్చిన ప్రతి మాటా నిలబెట్టుకుంటాం, చేసేదే చెబుతాం, చెప్పిందే చేస్తాం… ఇదే మీ జగనన్న ప్రభుత్వం, మన విధానం’ అని ప్రజలకు వివరించారు.
తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని సిఎం సీటులో కూర్చో బెట్టడం కోసమే ఎల్లో మీడియా పనిచేస్తూ, నిత్యం ప్రభుత్వంపై బురద జల్లుతోందని విమర్శించారు. తాము ఎంత మంచి చేస్తున్నా వారికి చెడు మాత్రమే కనబడుతోందన్నారు. పెన్షన్లు పెంచాలని మనం నిర్ణయం తీసుకుంటే దుష్ట చతుష్టయం ఓర్వలేకపోతోందన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకొనే చంద్రబాబు.. ఆయన పాలనలో ఒక్కటంటే ఒక్క మంచి పని చేశానని చెప్పుకోవడానికి ఏదైనా ఆధారం ఉందా అని ప్రశ్నించారు.