గుంటూరు తోక్కిసలాట ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుతో పాటు జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పటంలో గోడలు కూల్చితేనే అంతలా స్పందించిన పవన్ కందుకూరు, గుంటూరుల్లో ప్రాణాలు కోల్పోయినా సరే నిద్ర నటిస్తున్నారంటూ మండిపడ్డారు.
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్ చేస్తూ… “ ఇప్పటం అభివృద్ధిలో భాగంగా గోడ కూల్చితే కారెక్కి ఎగేసుకుని వచ్చి రచ్చ చేసిన ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కందుకూరులో 8 మంది నిన్న గుంటూరులో ముగ్గురిని పొట్టన బెట్టుకుంటే ఎక్కడ దాక్కున్నావ్ ?” అంటూ నిలదీశారు.
మాజీ మంత్రి పేర్ని నాని…. “ఇప్పటం గ్రామంలోని ఇంటి ఆక్రమిత ప్రహరీ గోడలకి ఉన్నటువంటి విలువ, కందుకూరులో 8మంది మరియు గుంటూరు పట్టణంలో ముగ్గురు సామాన్యుల ప్రాణాలకు లేనట్టుగా నిద్ర నటించటం ఎటువంటి విలువలకు తార్కాణమో!” అంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నిన్ననే దీనిపై స్పందించారు. “నిన్న కందుకూరులో 8 మంది మృతి నేడు గుంటూరులో ఇప్పటికి 3 మృతి ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి” అంటూ ట్వీట్ చేసిన అంబటి నేడు…”చంద్రన్న నువ్వే ఈ రాష్ట్రానికి పట్టిన ఖర్మన్న!” అంటూ స్పందించారు.