A Tribute: ప్రపంచంలో కొన్ని పనులవల్ల కొందరికి గుర్తింపు వస్తుంది. చాలా అరుదుగా కొందరి పనుల వల్ల ఆ పనులకే గుర్తింపు వస్తుంది. ఫుట్ బాల్ ఆటలో బాగా రాణిస్తూ అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్నవారు ఎందరో ఉన్నారు. తన ఆట వల్ల ఫుట్ బాల్ ఆటకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చినవాడు మాత్రం పీలే ఒక్కడే.
ఇటీవల కన్నుమూసిన ఫుట్ బాల్ మేరునగధీరుడు పీలే గురించి ఎంత చెప్పినా…ఇంకా చెప్పాల్సింది ఎంతో మిగిలిపోయి ఉంటుంది.
ఆయన చనిపోయినా…ఫుట్ బాల్ ఆటలో ఆయన చిరంజీవిగా ఎలా ఉన్నాడో వివరిస్తూ అనేక కోణాల్లో వార్తలను మీడియా వండి వార్చింది.
ఈసందర్భానికి నాకు బాగా నచ్చినది టైమ్స్ ఆఫ్ ఇండియా కార్టూన్, అమూల్ కార్టూన్.
లైన్ ఆఫ్ నో కంట్రోల్ పేరిట సందీప్ ఆధ్వర్యు వేసిన కార్టూన్ అనన్యసామాన్యంగా ఉంది. గాల్లో తేలుతూ బంతిని గోల్ చూడకుండా గోల్లోకి తన్నే పీలే ట్రేడ్ మార్క్ బైసికిల్ షాట్ ను ప్రస్తావిస్తూ ఈ కార్టూనిస్ట్ చేసిన ప్రయోగం పీలే విన్యాసంతో పోటీ పడింది.
చనిపోయి మేఘాల్లోకి వెళుతున్న పీలే కాలి కింద ఫుట్ బాల్ ఉంది. “భగవంతుడా! బైసికిల్ షాట్ ఎలా కొట్టాలో నేర్చుకోవాలనుందా?
అలాగే…నేర్పుతా.
ఇంతకూ…ఏ బంతితో ప్రాక్టీస్ చేస్తావ్?”
అని పీలే దేవుడిని అడుగుతున్నాడు. అంతరిక్షంలో నాలుగయిదు గ్రహాలు కూడా ఫుట్ బాల్లా కనిపిస్తున్నాయి. ఇది అపురూపమయిన నివాళి. వెయ్యి సంపాదకీయాల పెట్టు. ఆలోచించగలిగినవారికి ఆలోచించినంత భావం. చెప్పిన మాటలకంటే గీతలు చెప్పని మాటలు చెప్పే భావం ఇందులో అనంతం.
“SIMPELE the Best”
అన్న అమూల్ కార్టూన్ సింప్లి ది బెస్ట్ వాడుక మాటలో “పీలే” ను ఆకాశానికెత్తిన శబ్ద చమత్కారం పులకింత. ఇందులో కూడా బైసికిల్ షాట్ ప్రధానంగా ఉంది.
అంతటివాడికి తగిన గీతలు, మాటలు అంటే ఇలాగే ఉండాలి.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :