Monday, May 20, 2024
HomeTrending Newsవెన్నుపోటు ఆయన నైజం: జగన్ ఫైర్

వెన్నుపోటు ఆయన నైజం: జగన్ ఫైర్

గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రజలందరికీ మంచి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని… ఏనాడూ మంచి చేసిన చరిత్ర లేని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయిందన్నారు. తల్లి దండ్రులను చంపిన వ్యక్తే జడ్జి ఎదుట.. తాను తల్లిదండ్రులు లేని వ్యక్తినని  క్షమించి వదిలేయాలని వేడుకున్నట్లు చంద్రబాబు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.

ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఆయన ఫోటోకు దండ వేస్తారని విమర్శించారు. సిఎం కుర్చీతో పాటు ఎన్టీఆర్‌ ట్రస్టుని, ఎన్టీఆర్‌ శవాన్ని కూడా లాక్కున్నారని,  అవసరం వచ్చినప్పుడు మాత్రం ‘తమ్ముళ్లూ… ఎన్టీఆర్‌ అంత గొప్పవాడు ఎవరైనా ఉంటారా?’ అంటూ మాట్లాడతారని దుయ్యబట్టారు. “ఎన్టీఆర్‌ అయినా, ప్రజలైనా ఈ పెద్ద మనిషికి తెలిసిన నైజం  వెన్నుపోటు పొడవడం. ఫోటో షూట్, డ్రామాలు చేయడం, మొసలి కన్నీరు కార్చడం ఇదే ఈ పెద్దమనిషి నైజం” అంటూ ఫైర్ అయ్యారు.  తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల ప్రాంగణంలో వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక పెంపు వారోత్సవాల్లో పాల్గొన్న సిఎం జగన్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాజకీయ పరిస్థితులపై స్పందించారు.

ఫోటో షూట్‌ కోసం, డ్రోన్‌ షాట్ల కోసం గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలో 29 మందిని పొట్టన పెట్టుకున్న చంద్రబాబు… ఇప్పుడు కందుకూరు, గుంటూరు ఘటనలలో మరో 11 మంది మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. కందుకూరు సభలో ఎనిమిది మంది చనిపోతే వారు టీడీపీ కోసం త్యాగం చేశారని చెప్పారని, వారిలో ఎస్సీలు ఉంటే వారు తన కోసం త్యాగం చేశారని దాన్ని కూడా ఉపయోగించుకునే దారుణమైన ఆలోచనలు చేస్తారని ధ్వజమెత్తారు. కొత్త సంవత్సరం రోజున మరో ముగ్గురిని కూడా ఫోటో షూట్‌ల కోసం, డ్రోన్‌ షాట్‌ కోసం బలితీసుకున్న పరిస్థితి మనమంతా చూశామన్నారు.

“కానీ మీ బిడ్డకు వీళ్లమాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేకపోవచ్చు. దత్తపుత్రుడు అండ ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డకు ఉన్నదేమిటంటే… ఆ దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే. ఆ పెద్ద మనిషి చంద్రబాబు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడుని నమ్ముకోవచ్చు. కానీ మీ బిడ్డ ఒక ఎస్సీని, ఒక బీసీ, ఒక మైనార్టీని, పేదవర్గాలను నమ్ముకున్నాడు” అంటూ విజ్ఞప్తి చేశారు.

“ ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది కులాల యుద్ధం కాదు. క్లాస్‌ యుద్ధం. ఒకవైపు పేదవాడు, మరోవైపు పెత్తందారీ వ్యవస్ధ. వీరి మధ్య యుద్దం జరుగుతుంది. జాగ్రత్తగా ఆలోచన చేయండి. పొరపాటు జరిగితే పేదవాడు నాశనమైపోతాడన్నది మర్చిపోవద్దు’ అని ప్రజలకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్