శ్రీలంకతో జరిగిన రెండో టి20లో ఇండియా ఓటమి పాలైంది. లంక ఇచ్చిన 207 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇండియా టాపార్డర్ బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. సూర్యకుమార్, అక్షర్ పటేల్, శివం మావిలు మెరుపు ఇన్నింగ్స్ తో జట్టును విజయం అంచుల వరకూ తీసుకెళ్ళారు… కానీ చివరకు 16 పరుగుల తేడాతో విజయం లంకను వరించింది.
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లంక కెప్టెన్ దాసున్ శనక 20 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసి తమ దేశం తరఫున టి20లో వేగంగా ఈ ఘనత సాధించిన రికార్డు నెలకొల్పాడు. శనక 22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లతో 56 (నాటౌట్); ఓపెనర్ కుశాల్ మెండీస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52; అసలంక 19 బంతుల్లో 4 సిక్సర్లతో 37; మరో ఓపెనర్ పాతుమ్ నిశాంక 33 పరుగులతో సత్తా చాటారు. దీనితో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3; అక్షర్ పటేల్ 2, యజువేంద్ర చాహల్ ఒక వికెట్ పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, శివం మావిలు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.
ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇండియా 34 పరుగులకే నాలుగు వికెట్లు (ఇషాన్ కిషన్-2; శుభ్ మన్ గిల్-5; రాహుల్ త్రిపాఠి-5; హార్దిక్ పాండ్యా-12) కోల్పోయింది. దీపక్ హుడా కూడా విఫలమై 9 పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్- అక్షర్ పటేల్ లు ఆరో వికెట్ కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. సూర్య కుమార్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసి 16వ ఓవర్లో…..అక్షర్ పటేల్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యారు. శివం మావి 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 26 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యాడు.
లంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక, కాసున్ రజిత, కెప్టెన్ శనక తలా రెండు; కరుణరత్నే, హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.
శనక కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.