Veteran Director D V Narasa Raju :
తెలుగు సినిమా కథ ఆది నుంచి అనేక మలుపులు తిరుగుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఎంతోమంది రచయితలు తమ కలాన్ని ‘ఉలి’గా మలచుకుని కథా కథన శిల్పాలను తీర్చిదిద్దారు. కాలానికి తగిన కథలను కమనీయంగా అందిస్తూ తమ ప్రతిభాపాటవాలను చాటుకున్నారు. కథ .. కథనం .. సంభాషణలు అందించడంలో ఎవరికి వారు తమదైన శైలిని ఆవిష్కరించారు. తెలుగు కథకు ఒక అందాన్ని .. ఆకర్షణను తీసుకుని వస్తూ, ఆసక్తికరమైన మలుపులతో మజిలీలు చేయిస్తూ పరుగులు పెట్టించారు. అలాంటి కథారచయితలలో డీవీ నరసరాజు ఒకరు.
నరసరాజు గుంటూరు జిల్లాలోని ‘తాళ్లూరు’లో జన్మించారు. శ్రీమంతుల ఇంట జన్మించిన ఆయన, డిగ్రీ పూర్తి చేశారు. మొదటి నుంచి కూడా ఆయనకి తెలుగు సాహిత్యంపై ఎక్కువ మక్కువ ఉండేది. విద్యార్థి దశ నుంచే ఆయనకి నాటకాలపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఆయన రాసిన నాటకాలకు మంచి పేరు వస్తుండటంతో, ఆ ప్రోత్సాహంతో ఆయన మరింతగా నాటకాలపై దృష్టిపెట్టారు. అలా ఒకసారి ఆయన రాసిన నాటకాన్ని ప్రదర్శిస్తూ ఉండగా దర్శకుడు కేవీ రెడ్డి చూశారు. కథ .. కథనం .. మాటలు చాలా బాగుండటంతో ఆయన అక్కడ నరసరాజుని కలిశారు.
ఆ సమయంలో కేవీ రెడ్డి ‘పెద్ద మనుషులు’ సినిమా తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే అందుకు తగిన రచయిత కోసం కొంతకాలంగా ఆయన అన్వేషిస్తున్నారు. అలాంటి సమయంలోనే ఆయనకి నరసరాజు తారసపడ్డారన్న మాట. “రచయితగా నా సినిమాకి పనిచేయగలరా”? అని కేవీ రెడ్డి అడగడంతో, ఆ మాటలను నరసరాజు నమ్మలేకపోయారట. అప్పటికే కేవీ రెడ్డిగారు ‘గుణసుందరి కథ’ .. ‘పాతాళభైరవి’ వంటి సినిమాలు చేసి ఉండటం వలన, ఆయన గురించి అంతా మాట్లాడుకుంటూ ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో ఆయనే తన కోసం వెతుక్కుంటూ వచ్చినట్టుగా అనిపించడంతో నరసరాజు ఆశ్చర్యపోయారు.
రచన పట్ల .. నాటకాల పట్ల మంచి ఆసక్తి .. ఉత్సాహం ఉండటం వలన, నరసరాజు ఎంతమాత్రం ఆలోచన చేయకుండా ఓకే అనేశారు. అలా కేవీ రెడ్డి దర్శకత్వంలో ‘పెద్ద మనుషులు’ సినిమాకి నరసరాజు పనిచేశారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆనాటి గ్రామీణ వ్యవస్థ .. పెద్దమనుషుల ముసుగులో కొందరు స్వార్థపరులు పేదవారి జీవితాలతో ఆడుకున్న తీరును ఆయన ఆవిష్కరించిన విధానం ఇప్పటికీ ఆసక్తిని రేకెత్తిస్తాయి .. ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను మలిచిన తీరు .. ఆ పాత్రలకి సెట్ చేసిన బాడీ లాంగ్వేజ్ .. సంభాషణలు అన్నీ కూడా గొప్పగా అనిపిస్తాయి. ఈ సినిమా విజయంతో ఆయనకి బీఎన్ రెడ్డి – చక్రపాణిలతో కూడా మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.
నరసరాజు నాటకాలకి పని చేసి ఉండటం వలన, ఒక కథను .. పాత్రలను ప్రేక్షకులకు దగ్గరగా ఎలా తీసుకెళ్లాలో, సన్నివేశాలను ఎంత సహజంగా ఆవిష్కరించాలో ఆయనకి బాగా తెలుసు. పాత్రల స్వరూప స్వభావాలు .. అవి ప్రవర్తించే పద్ధతి .. వ్యవహరించే తీరుపై ఆయనకి మంచి అవగాహన ఉంది. అందువలన నవరసాలను తన కలంలో పోసి నడిపించారు. వివిధ రకాల ‘యాస’ల్లోను జనరంజకమైన సంభాషణలను అందించారు. సాంఘికమే కాదు, జానపద, పౌరాణికాలకు సైతం తన కలం పదును చూపించారు .. విస్తృతమైన పరిధిలో వినోదాలను పంచారు.
తెలుగు జానపదాల్లో ‘రాజమకుటం’ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక పూర్తిస్థాయి జానపదానికి కావలసిన లక్షణాలన్నీ కూడా ఈ కథలో పుష్కలంగా కనిపిస్తాయి. ఎన్టీఆర్ .. కన్నాంబ .. గుమ్మడి .. రాజనాల పాత్రలను మలిచిన తీరు ‘ఔరా!’ అనిపించకమానదు. అధికారం చుట్టూ .. అంతఃపురాల చుట్టూ కుట్రలు .. కుతంత్రాలు ఎలా అల్లుకుని ఉంటాయో .. అలుముకుని ఉంటాయో అనేది అద్భుతంగా ఆవిష్కరించిన చిత్రం ఇది. ఇక పౌరాణికమైన ‘భక్త ప్రహ్లాద’ సంభాషణల రచయితగా నరసరాజు అసమానమైన ప్రతిభకు కొలమానంగా నిలుస్తుంది. సాధారణమైన ప్రేక్షకులకు కూడా అర్ధమయ్యే రీతిలో తేలికైన పదాలతోనే ఆయన చేసిన విన్యాసాలు ఆ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి.
Veteran Director D V Narasa Raju :
నరసరాజు అసమానమైన రచనా పటిమకు ఆనవాలుగా ‘గుండమ్మ కథ‘ కనిపిస్తుంది. ఇప్పటికీ టీవీ ముందు కూర్చుంటే, తెరపై కాకుండా మన పక్కింట్లో జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఒక ఇంట్లో సూర్యకాంతం .. సావిత్రి .. జమున, మరో ఇంట్లో ఎస్వీఆర్ .. ఎన్టీఆర్ .. ఏఎన్నార్, మధ్యలో మేమున్నాం అంటూ ఎంట్రీ ఇచ్చే రమణా రెడ్డి – ఛాయాదేవి. ఇన్ని పాత్రలను బ్యాలెన్స్ చేయడం అంత ఆషామాషి విషయమేం కాదు. ఈ పాత్రలను మలిచిన తీరు .. వాటిని పరిచయం చేసే పద్ధతి .. పాత్రలన్నీ ఒక్కొక్కటిగా ఒకే కప్పుక్రిందికి చేరడం .. అక్కడ చోటుచేసుకునే గందరగోళంతో ఈ సినిమా నడిచిన విధానాన్ని ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు. ఒక కథను ఎంత సరదాగా .. ఎంత రసవత్తరంగా చెప్పవచ్చనేది నరసరాజు ఈ సినిమాతో నిరూపించారు.
‘రంగుల రాట్నం’ .. ‘చదరంగం’ .. ‘బాంధవ్యాలు’ సినిమాలు, ఆయన తన కలంతో పలికించిన ఎమోషన్స్ కి అద్దం పడతాయి. ‘యమగోల’ సినిమా .. హాస్యాన్ని ఆయన ఏ స్థాయివరకూ తీసుకువెళ్లగలరనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. కథపై ఆయనకి ఎంత పట్టు ఉందో .. కథనంపై కూడా అంతే పట్టు ఉండేది. ఇక పాత్రోచితమైన సంభాషణలను తన కలం నుంచి కురిపించడంలో ఆయనకి ఆయనే సాటి. అప్పట్లో కథ విషయంలో అంతా ఓకే అనుకోగానే ఆర్టిస్టుల ఎంపిక జరిగిపోయేది. అందువలన నరసరాజు ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా సంభాషణలు రాసేవారు. డైలాగ్స్ లో తనదైన విరుపులను మెరిపించేవారు.
కథా విస్తరణ ఎంతవరకూ ఉండాలి? పాత్రలను ఎంతవరకూ పరిగెత్తించాలి? ఏ పాత్ర ప్రయోజనం ఏమిటి? ఏ పాత్ర ఎక్కడ మొదలై .. ఎక్కడ ఆగిపోవాలి? కథలో ఏ విషయాన్ని ఎక్కడ దాచాలి? ఎప్పుడు చెప్పాలి? అనే ఒడుపు నరసరాజుకి బాగా తెలుసు. కథలో .. సన్నివేశంలో .. పాత్రలో .. సంభాషణలో ఆత్మ ఉండాలి. కథలో ఆత్మలేనిదే కలం కాగితాన్ని దాటలేదు. ఆత్మలేని శరీరం ఎలాంటిదో .. అది లేని కథ కూడా అలాంటిదే అనేవారాయన. తెలుగు కథాకథనాలను సహజంగా .. సరసంగా .. సుందరంగా కొత్త దారిలో పరుగులు తీయించిన ఆయన జయంతి నేడు (జూలై 15). ఈ సందర్భంగా ఆయనను ఒకసారి స్మరించుకుందాం.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read : సీతారామయ్యగారి మనవరాలు