Sunday, November 24, 2024
HomeTrending Newsతునికాకు కూలీలకు 233 కోట్ల బోనస్‌

తునికాకు కూలీలకు 233 కోట్ల బోనస్‌

గిరిజ‌నులు, కూలీల‌కు ఉపాధి క‌ల్పించే తునికాకు (బీడీ ఆకు) సేక‌ర‌ణ బోన‌స్ (నెట్ రెవెన్యూ) ను చెల్లించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. కూలీలకు తునికాకు సేకరణ పెండింగ్ బోనస్ చెల్లింపులు, ఈ సీజ‌న్ లో తునికాకు సేక‌ర‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై అధికారుల‌తో అర‌ణ్య భ‌వ‌న్ లో స‌మీక్ష నిర్వ‌హించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 30 జిలాల్లోని 37 డివిజన్‌లలో విస్తరించిన అటవీ ప్రాంతాల్లో సేకరించిన బీడీ ఆకులను రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా సేకరిస్తున్నామ‌ని అధికారులు మంత్రికి వివ‌రించారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న అనంత‌రం ఇరు రాష్ట్రాల నెట్ రెవెన్యూ షేర్ ల‌ను తేల్చ‌డం, కూలీలు వేర్వేరు ప్రాంతాల్లో ఉండ‌టంతో వారి వివ‌రాల సేక‌ర‌ణ వ‌ల్ల బోన‌స్ చెల్లింపుల్లో జాప్యం జ‌రిగింద‌ని తెలిపారు. తునికాకు సేక‌రించే కూలీల పేర్లు, బ్యాంక్ ఖాతాల వివ‌రాల సేక‌ర‌ణ పూర్తైంద‌ని, దాదాపు రూ. 233 కోట్ల బోన‌స్ డ‌బ్బులు చెల్లించాల్సి ఉంద‌ని చెప్పారు.

స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ… బోన‌స్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జ‌రిగిందని, వీలైనంత త్వరగా కూలీలకు బోనస్‌ డబ్బులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల‌న్నారు. వేసవిలో సుమారు 2. 50 ల‌క్ష‌ల మంది గిరిజన, గిరిజనేతర కూలీలకు ఆదాయం సమకూర్చిపెట్టే తునికాకు సేకరణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అడవిపై స్థానిక ప్రజలకే పూర్తి హక్కులు ఉన్నాయ‌ని, అటవీ సంపదపై వచ్చే ఆదాయం కూడా ఆ ప్రాంత ప్రజలకే చెందాలనే ఉద్దేశ్యంతో రాయల్టీ డబ్బులను కూలీలకు బోనస్‌ రూపంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చెల్లిస్తుంద‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌, అట‌వీ శాఖ స్పెష‌ల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ (HoFF) ఆర్.ఎం. డొబ్రియ‌ల్, అట‌వీ అభివృద్ధి సంస్థ వీసీ & ఎండీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, అద‌న‌పు పీసీసీఎఫ్ విన‌య్ కుమార్, తదిత‌రులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్