Tuesday, September 24, 2024
HomeTrending Newsతొమ్మిది మెడికల్ కాలేజీలకు త్వరలో టెండర్లు

తొమ్మిది మెడికల్ కాలేజీలకు త్వరలో టెండర్లు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. శనివారం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి ఎన్ హెచ్ ఎం, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి లపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు.  గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బృందం పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి కావాలన్నారు. నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. నిమ్స్, గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న ఎంసిహెచ్ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఇప్పటికే 20 తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లు ఉన్నాయని, వివిధ జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 సెంటర్లను త్వరగా అందుబాటులోకి తీసుకువచ్చేలా పనిచేయాలన్నారు.

అన్ని ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, మూడు నెలల బఫర్ స్టాక్ మెంటెయిన్ చేయాలన్నారు. మందుల సరఫరాలో ఎలాంటి నియంత్రణ ఉండవద్దని, అవసరమైన మేరకు మందులు ఆయా ఆసుపత్రుకు పంపిణీ చేయాలని ఆదేశించారు. రియేజెంట్స్ కొరత లేకుండా లేకుండా చూసుకోవాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహించి, 24 గంటల్లోగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య పరికరాలు నిత్యం పని చేసే విధంగా ఉండేందుకు గాను, తక్షణం రిపేర్లు చేసేందుకు ఏర్పాటు చేసుకున్న ఇ ఉపకరణ్ పోర్టల్ ను పూర్తిగా వినియోగించాలన్నారు. ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చూసుకోవడం సూపరింటెండెంట్ ల బాధ్యత అన్నారు. సమీక్షలో కుటుంబ ఆరోగ్యం సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, డీ ఎం ఇ రమేష్ రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్