Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్ఆ ఆలోచన లేదు: రోహిత్ శర్మ

ఆ ఆలోచన లేదు: రోహిత్ శర్మ

పొట్టి ఫార్మాట్ నుంచి విరమించుకొనే ఆలోచన ప్రస్తుతానికి లేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. వరుస క్రికెట్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవడం అనివార్యమని, అంతమాత్రాన ఆ ఫార్మాట్ కు ముగింపు పలుకుతున్నట్లు కాదని చెప్పాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రేపు మంగళవారం మొదటి మ్యాచ్ గువహటిలో జరగనుంది. ఈ సందర్భంగా అక్కడ రోహిత్ శర్మ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.

శ్రీలంకతో మొన్న ముగిసిన మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించాడు, సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్, కెఎల్ రాహుల్ లకు విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ ను టి 20 కెప్టెన్ గా కొనసాగించి, రోహిత్ ను వన్డేలు, టెస్ట్ ఫార్మట్ లకు సారధిగా కొనసాగిస్తారని, రాబోయే టి 20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని సీనియర్ ఆటగాళ్లను వన్డేలు, టెస్టులకే పరిమితం చేసి యువజట్టును ఆ మెగా టోర్నీకి సిద్ధం చేస్తారని వార్తలు వినబడుతున్నాయి, ఈ సమయంలో రోహిత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాబోయే ఐపీఎల్ సీజన్ కు ముందు కేవలం ఆరు టి 20 మ్యాచ్ లు మాత్రమే ఆడాల్సి ఉందని, వాటిలో మూడు ఇప్పటికే (శ్రీలంక తో) ముగిశాయని.. ఐపీఎల్ ముగిసిన తరువాతే యువ జట్టు శక్తి, సామర్ధ్యాలు, వారి ప్రతిభను అంచనా వేసేందుకు వీలు ఉంటుందని అభిప్రాయపడ్డారు.  పొట్టి ఫార్మాట్ లో తన పాత్రపై కూడా అప్పుడే స్పష్టత వచ్చే అవకాశం ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు. ఏదైమైనా ఈ ఫార్మట్ ను ఇప్పుడిప్పుడే వదిలిపెట్టాలని తాను అనుకోవడం లేదని చెప్పాడు. రాబోయే వన్డే ప్రపంచ కప్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుందన్నాడు.

రేపటి వన్డేలో శుభ్ మన్ గిల్ తో కలిసి తాను ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని, ఇషాన్ కిషన్ కు చోటు కల్పించలేకపోవచ్చని రోహిత్ చెప్పాడు.  బుమ్రా ఆడలేకపోవడం దురదృష్టకరమని అన్నాడు. రెండ్రోజుల క్రితమే బుమ్రా ఫిట్ నెస్ నిరూపించుకొని స్థానం సంపాదించాడని, ఇంతలోనే  అతన్ని పక్కన పెట్టాల్సి రావడం బాధాకరమే అయినా అతని విషయంలో ఏ ఒక్క ఛాన్స్ తీసుకోకూడదని, ఇబ్బంది ఉన్నప్పుడు విశ్రాంతి ఇవ్వడమే సమంజసమని పేర్కొన్నాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్