తెలంగాణలో సాగునీటి వనరుల పెరుగుదలతో రైతుల్లో వ్యవసాయం పట్ల ఆత్మవిశ్వాసం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి సమీపంలోని ఈదుల చెరువు నుంచి రూ.92 లక్షలతో మెట్పల్లి, రంగంగడ్డ, నందిమల్ల గడ్డ, మేగ్యాతండాలకు సాగునీరు అందించే ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అదేవిధంగా రూ.8 లక్షలతో మెట్ పల్లిలో నిర్మించిన రీడింగ్ రూమ్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే లక్ష్యం గా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మెట్ పల్లి మినీ ఎత్తిపోతల వల్ల 2 వేల ఎకరాలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. కాలువల ద్వారా నీళ్లు అందని ప్రాంతాలకు మినీ ఎత్తిపోతల పథకాలతో చెరువులు, కుంటలు నింపి సాగునీరు అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు.
ఈదుల చెరువు నుంచి రూ.92 లక్షలతో మినీ లిఫ్ట్ ఏర్పాటుచేస్తామని అన్నారు.పట్టణ సమీపంలో ఉన్న రైతులు సాగునీటి రాకతో కూరగాయలు, ఆకుకూరల సాగు, పాడిపశువులతో ఆదాయం పొందుతున్నారని మంత్రి వివరించారు . ఇప్పటి వరకు 65 మినీ ఎత్తిపోతల పథకాల ఏర్పాటు చేయడం రాష్ట్రంలోనే రికార్డు అని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎస్ఆర్ నిధులతో ఎత్తిపోతలు పూర్తిచేస్తున్నామని వివరించారు