జీవో నంబర్ 1 ను ఈనెల 23 వరకూ సస్పెండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ తీర్పు చెప్పింది. ప్రజల భావ ప్రకటనా స్వేఛ్చను, ప్రాథమిక హక్కులను కాలరాసేలా ఉందని పేర్కొంది. తదుపరి విచారణ ఈనెల 20 కు వాయిదా వేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కందుకూరు, గుంటూరుల్లో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన సభల సందర్భంగా రోడ్లపై బహిరంగసభలు, రోడ్ షో లను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1 ను తీసుకు వచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే. రామ కృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగింది. పిటిషనర్ తరఫున అశ్విని కుమార్ తన వాదనలు వినిపించారు. ప్రభుత్వం చట్టం తీసుకురావడంలో తప్పు లేదని కానీ ఆ చట్టం రాజ్యాంగంలోని ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉండరాదని, మాట్లాడడం. నలుగురు కలిసి మాట్లాడుకోవడాన్ని నిషేధించడం అంటే నోటిని, సమావేశాన్ని రెంటినీ అదుపు చేయాలని భావించడం రాజ్యాంగం లోని 19(1) ను అడ్డుకోవడమే అవుతుందని ఆయన వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ బట్టు దేవానంద్ నేతృత్వంలోని సింగల్ బెంచ్ ఈ జీవోపై సస్పెన్షన్ విధించింది.