సీనియర్ రాజకీయ నేత, జనతాదళ్ (యునైటెడ్) మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ కన్నుమూశారు. అయన వయస్సు 75 సంవత్సరాలు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నిన్న రాత్రి సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చి కుప్ప కూలారు. గురుగ్రామ్ లోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే నాడి ఆగిపోయిందని వైద్యులు వెల్లడించారు. శరద్ యాదవ్ మరణ వార్తను ఆమె కుమార్తె శుభాషిణి యాదవ్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మొత్తం ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికైన శరద్ మొదటి రెండుసార్లు మధ్యప్రదేశ్ లోని జబల్బూర్ నుంచ, ఉత్తర ప్రదేశ్ లోని బదౌన్ నుంచి ఒకసారి, మాధెపురా నుంచి నాలుగుసార్లు విజయం సాధించారు.
మూడు సార్లు రాజ్య సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే 2016లో మూడోసారి ఎన్నికైన కొద్ది కాలానికే జనతాదళ్ యునైటెడ్ పార్టీలో విభేదాలు వచ్చి ఆయన్ను అధ్యక్షుడిగా తొలగించారు. అయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని నాటి రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడికి జెడి (యు) నోటీసు ఇవ్వగా మరో ఆలోచన లేకుండా దాన్ని ఆమోదించడంతో శరద్ యాదవ్ తన సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
2018లో లోక్ తాంత్రిక్ జనతా పార్టీని స్థాపించినా కొద్ది కాలానికే అయన దాన్ని లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో విలీనం చేశారు.
విద్యార్ధి నేతగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన శరద్ మండల కమిషన్ సిఫార్సుల అమల్లో కీలక పాత్ర పోషించారు.
2009నుంచి 14 వరకూ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో పౌర విమానయాన, వినియోగదారుల వ్యవహారాలు. ఆహారం- ప్రజా పంపిణీ వ్యవస్థ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు.