పార్టీ నుంచి వెళ్ళిపోడానికి ఒక బేస్ క్రియేట్ చేసుకునే క్రమంలోనే ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఫోన్ రికార్డుకు, ట్యాపింగ్ కు తేడా ఉందన్నారు. తన వద్దకు వచ్చిన ఓ ఆడియోను పోలీసు అధికారి శ్రీధర్ రెడ్డికి పంపి ఉంటారని, ట్యాపింగ్ చేస్తున్నట్లు సదరు అధికారి చెప్పలేదని స్పష్టం చేశారు.
టిడిపి భవిష్యత్ నాయకుడిగా లోకేష్ ను తీర్చి దిద్దే క్రమంలోనే యువ గళం పాదయాత్ర మొదలు పెట్టారని గుడివాడ ఎద్దేవా చేశారు. ఒక రాజకీయ పార్టీ పెట్టిన నేతకు ప్రతి గ్రామంలో తన పార్టీ జెండా ఎగరాలని, రాష్ట్రంలో ప్రతి మూలా తన పార్టీ ఉండాలన్న ఆలోచన ఉంటుందని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తనకు 25 సీట్లు చాలని అంటున్నారని గుడివాడ విమర్శించారు. సహజంగా ఏ పార్టీ అయినా రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని, రాష్ట్రంలో బలహీనంగా ఉన్న పార్టీని ఇంకా నష్టపరిచి అధికారం దిశగా వెళ్లాలని ఎవరైనా ఆలోచిస్తారని, కానీ టిడిపితో సీట్ల కోసం పవన్ బేరాలాడడం ఏమిటని మంత్రి ప్రశ్నించారు. తనకు 600 ఎకరాలు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ నిరూపిస్తే ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని, జనసేన పార్టీకి రాసిస్తానని సవాల్ చేశారు.
విశాఖ రాష్ట్ర భవిష్యత్తులో ఓ కీలక భూమిక పోషించబోతోందని అమర్నాథ్ అన్నారు. దీనిపై నిన్నటి ఢిల్లీ సదస్సులో సిఎం జగన్ కూడా స్పష్టమైన ప్రకటన చేశారని గుర్తు చేశారు. సిఎం త్వరలో ఇక్కడకు షిఫ్ట్ అవుతున్నారని, ఇది ఎప్పుడో తీసుకున్న నిర్ణయమని తెలిపారు. మూడు రాజధానుల బిల్లు వెనక్కు తీసుకున్న తరువాత సిఎం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ కిందకు ఎలా వస్తాయని మంత్రి ప్రశ్నించారు. రాజధానులను నిర్ణయించుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిందని, దీనిపై జీవీల్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
Also Read : ఆ అవసరం లేదు: బాలినేని