శుభ్ మన్ గిల్ సెంచరీతో శివాలెత్తడంతో పాటు కెప్టెన్ పాండ్యా బాల్ తో అద్భుతం సృష్టించడంతో మూడవ టి 20లో ఇండియా ఏకంగా 166 పరుగులతో ఘన విజయం సాధించి మ్యాచ్ తో పాటు సిరీస్ ను చేజిక్కించుకుంది.
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన నేటి మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 7 వద్ద ఇషాన్ కిషన్ (1) ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాట్స్ మెన్ చెలరేగి ఆడారు.
గిల్ 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 126 పరుగులు చేసి జేయంగా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో 4 ఫోర్లు, 3సిక్సర్లతో 44; పాండ్యా 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ తో 30; సూర్య కుమార్ 24 పరుగులతో రాణించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 21 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. జట్టులో డెరిల్ మిచెల్-34; కెప్టెన్ శాంట్నర్-13… ఇద్దరే రెండంకెల స్కోరు చేయగలిగారు. 12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
భారత బౌలర్లలో పాండ్యా-4; అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి తలా 2 వికెట్లు పడగొట్టారు.
శుభ్ మన్ గిల్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…. హార్దిక్ పాండ్యా ‘ప్లేయర్ అఫ్ ద సిరీస్’ అందుకున్నారు.