జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ ఫ్రెండ్ షీప్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సందర్శించిన జర్మనీ పార్లమెంట్ సభ్యుల బృందం హైదరాబాద్లో పర్యటించింది. ఇందులో భాగంగా బృందం సభ్యులు తెలంగాణ శాసనసభ సమావేశాలను పరిశీలించారు. ఆ తర్వాత జర్మనీ బృందంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలోని కమిటీ హాల్ లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్వర్ రెడ్డి, శాసనసభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార అవకాశాలు, అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి కేటీఆర్ – జర్మన్ బృంద సభ్యులకు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని, అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. తదనంతరం జర్మనీ బృంద సభ్యులను శాలువా, మెమొంటోతో మంత్రి కేటీఆర్, స్పీకర్ పోచారం సత్కరించారు.